హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఆదివారంతో లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఇక శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇలా అదునుగా చేసుకొని కొందరు ఇష్టారీతిన బ్లాక్ దందా నడుపుతున్నారు. సాధారణ ధరల కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ధరకి ఐపిఎల్ టికెట్లను విక్రయిస్తున్నారు.


రూ.1,500 టికెట్‌ను రూ.8వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో విఐపి బాక్సు టికెట్లు రూ.లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. దీంతో సిపి సుమతి ఆదేశాలతో పోలీసులు బ్లాక్ టికెట్ల విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్‌వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నలుగురు యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఇక రాత్రి 7.30 గంటలకు ఆర్‌సిబి, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.