ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టి-20లో టీం ఇండియా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జాకబ్ బేతల్ (76 నాటౌట్) అద్భతంగా రాణించడంతో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ భారత్‌కు అనుకూలంగా ఉన్న సమయంలో రవి బిష్ణోయ్ ఓవర్ మ్యాచ్‌ ఫలితాన్ని తారు మారు చేసింది. కీలకమైన సమయంలో 17వ ఓవర్ వేసిన బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌తో మొత్తం కలిపి నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు. 17వ ఓవర్‌ వరకూ భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా ఆ తర్వాత మ్యాచ్ ఫలితమే మారిపోయింది. చేజేతులా మ్యాచ్‌ని ఇంగ్లండ్‌కు ధారదత్తం చేసింది.

దీనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. రవి బిష్ణోయ్‌ని తుది జట్టులోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. అతడు చాలా దారుణమైన ప్రదర్శన చేశాడని విమర్శించారు. ఈ ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని అన్ని మ్యాచుల్లో ఆడించలేదు. మరి టీం ఇండియాలో ఎలా ఆడించారు అని శ్రీకాంత్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించారు. బిష్ణోయ్‌కి బదులు కుల్దీప్ యాదవ్‌ని జట్టులో తీసుకోవాల్సిందని సూచించారు.