
అమరావతి: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలని, కానీ విధానపరంగానే ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ రీకౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి మాట్లాడుటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారన్నారు. కేవలం అనితను అన్నట్టు కాదని మహిళలందరినీ కించపరిచినట్లేనని మండిపడ్డారు. ఒక విషయం మాట్లాడేటప్పుడు నచ్చకపోతే ఆ విషయాన్ని విమర్శించాలన్నారు. వైసిపి వాళ్లు మాట్లాడే మాటలు ఎంతటి అభ్యంతరకరమైనవో ప్రజలకు వివరించాలని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలని పవన్ పేర్కొన్నారు. ప్రజలు హర్షించే భాషలోనే కూటమి నేతలు మాట్లాడాలని సలహా ఇచ్చారు. నోటికొచ్చినట్లు ఇళ్లలో మహిళలను కించపరిచే విధంగా వైసిపి వాళ్లు మాట్లాడుతున్నారని, వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.












