హైదరాబాద్: పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువులందరికీ హృదపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు.  “గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వారి బోధనలను ఆచరిస్తే ప్రతి అడుగూ విజయానికి నాంది అవుతుంది” అని రేవంత్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థాన్ని, లక్ష్యాన్ని అందిస్తారని అన్నారు. జీవితానికి దిశానిర్దేశం చేసి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, క్రమశిక్షణ, విలువలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి అమూల్యమైన సంపదను ప్రసాదిస్తారని తెలియజేశారు. 


తెలంగాణ వ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువును పూజించే రోజు గురు పూర్ణిమ అని అంటారు. గురు పూర్ణిమకు వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. వ్యాసుడి పుట్టినరోజు సందర్భంగా గురు పూర్ణిమ వేడుకలను నిర్వహించారు. సాయిబాబా ఆలయాల్లో భక్తుల విశేష పూజలు చేస్తారు.