నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీత, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరయ్యారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు.

పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని మంత్రి సురేఖ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ సిబ్బంది ప్రతేక క్యూలైన్లు ఏర్పాటుచేయడంతో భక్తులు అమ్మవారిని సులభంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, సుస్మిత పటేల్ తదితరులు పాల్గొన్నారు.