2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేరం జరిగిన తీరు అత్యంత క్రూరమైనదని శిక్ష ఖరారు చేస్తూ కోర్టు వ్యాఖ్యానించింది. “హత్యతోనే ఆ క్రూరత్వం ముగిసిపోలేదు. ద్వేషం ఇంకా చల్లారనట్లుగా అంకిత్ శర్మ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలోకి లాక్కెళ్లారు. ఈ నేరం అత్యంత అరుదైన కేసుల కోవకు చేరువగా ఉంది. నేరంలోని అమానవీయత.. శిక్ష తగ్గించేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితుల కంటే తీవ్రంగా ఉంది” అని కోర్టు పేర్కొంది. అయితే దోషులు మారే అవకాశం పూర్తిగా లేదని నిర్ధారించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. నేరంలో దోషుల వ్యక్తిగత పాత్ర స్పష్టంగా లేకపోవడం శిక్ష తగ్గింపునకు పరిగణించాల్సిన ముఖ్యమైన అంశమని పేర్కొంది. వారి విద్యా నేపథ్యం, తప్పుడు సమాచారంతో కూడిన వాతావరణం ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు కూడా శిక్ష తగ్గింపునకు అనుకూల అంశాలేనని అభిప్రాయపడింది.


ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల అంకిత్ శర్మను 2020 ఫిబ్రవరి చివర్లో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ సమయంలో ఓ గుంపు లాక్కెళ్లింది. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేసిన అనంతరం ఆయన మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశారు. మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించగా, దానిపై కనీసం 51 కత్తిపోట్లు ఉన్నట్లు వెల్లడైంది. తాహిర్ హుస్సేన్ తరఫు న్యాయవాది తారా నరులా మాట్లాడుతూ.. ఆయన గుంపులో మాత్రమే ఉన్నారని, నేరంతో నేరుగా సంబంధం లేదని వాదించారు. ఈ కేసులో కోర్టు ముందు జీవిత ఖైదు లేదా మరణశిక్ష అనే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఐదుగురు నిందితుల్లో ఎవరూ స్వయంగా కత్తిని ఉపయోగించలేదని, ఇతరులు చేసిన నేరానికి బాధ్యత వహించాల్సిన కేసుగానే కోర్టు పరిగణించిందని తెలిపారు. తమ క్లయింట్ నిర్దోషి అని తాము విశ్వసిస్తున్నామని, తీర్పుపై అప్పీలు చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

తీర్పు అనంతరం తాహిర్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. “న్యాయం ఆలస్యం కావచ్చు.. కానీ దక్కకుండా పోదు. హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది. ఈ మ్యాచ్ ముందే ఫిక్స్ అయింది” అని వ్యాఖ్యానించారు. చార్జిషీట్ ప్రకారం.. 2020 ఫిబ్రవరి 25న సాయంత్రం 5 గంటల సమయంలో తాహిర్ హుస్సేన్ ఇంటి సమీపంలో రెండు వర్గాల మధ్య ఘర్షణను శాంతింపజేసేందుకు అంకిత్ శర్మ ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయనను ఓ గుంపు చుట్టుముట్టింది. తీర్పు వెలువడిన అనంతరం ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా ‘ఎక్స్’లో స్పందించారు. “తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు విధించడం న్యాయానికి ఆరంభం. అంకిత్ శర్మను అత్యంత క్రూరంగా హత్య చేశారు. మరణించిన తర్వాత కూడా కత్తులతో పొడిచి, మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశారు. ఇది కచ్చితంగా అత్యంత అరుదైన కేసు. హైకోర్టులో ఈ జీవిత ఖైదు మరణశిక్షగా మారుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.