
టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రహానె జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. రహానె సారథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రహానెకు టీమిండియాలో చోటు దక్కడం లేదు. యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక జాతీయ జట్టులో స్థానం లభించడం కష్టమని భావించిన రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని రహానె సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు.
“ప్రతి దానికి ఆరంభం.. ముగింపు ఉంటాయనేది జీవిత సత్యం. సరైన సమయంలో దాన్ని గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. తాను కూడా ఈ విషయాన్ని గుర్తించి తగిన సమయంలో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించాను” అని పేర్కొన్నాడు. కాగా రహానె తన కెరీర్‌లో 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, మరో 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 92 వన్డేలు ఆడి 2,962 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మరో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 20 టి20లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 375 పరుగులు చేశాడు.











