
ప్రపంచానికి ఇప్పుడు కావలసింది అన్నవస్త్రాలా, అణ్వాస్త్రాలా?.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది పేదరికంలో మగ్గిపోతూ కూడూ గుడ్డా లేక అలమటిస్తుంటే అగ్రరాజ్యాలు మొదలుకొని వర్ధమాన దేశాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉండడం శోచనీయం. అణ్వాస్త్ర వ్యాప్తికి మొదట ఆజ్యంపోసింది అమెరికాయే. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫాసిజాన్ని తుదముట్టించడానికి సోవియెట్ సైనిక దళాలు పురోగమించడాన్ని అమెరికా ఓర్వలేకపోయింది. సోవియెట్ యూనియన్ను కట్టడి చేయడానికి తన సత్తా నిరూపించడానికి 1945 ఆగస్టు 6న జపాన్ లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగించింది. ఆ నగరం బూడిద కుప్పలా కూలిపోవడంతోపాటు 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజులు పోయిన తరువాత జపాన్ లోనే నాగసాకి పట్టణంపై అణుబాంబులు కుమ్మరించింది. 90 వేల మందిని పొట్టన పెట్టుకుంది. మెన్హట్టన్ ప్రాజెక్టు ద్వారా తాను రూపొందించిన అణుబాంబులు ఎంతమందిని చంపగలవో తెలుసుకోడానికే నాగసాకిపై దాడి చేసిందంటే అమెరికా మారణకాండ ఎంతటి వినాశనానికి దారితీస్తోందో చెప్పవచ్చు. ఈ విలయం జరిగి ఇప్పటికి 80 ఏళ్లు అయినా అమెరికా తాను సాగించిన మారణకాండకు పశ్చాత్తాపం పడడం లేదు. ఇప్పటికీ ఇరాన్ వంటి దేశాలపై ఏవో సాకులు చూపించి దాడులు సాగిస్తోంది.
అమెరికా అణ్వస్త్ర పోటీని చూసి సోవియెట్, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా అణ్వస్త్ర అగ్రరాజ్యాలుగా వర్ధిల్లడం వినాశనానికే తప్ప మానవ క్షేమం కోసం కాదు. అమెరికా అణుబాంబుల ప్రయోగం తరువాత నాలుగేళ్లకు సోవియెట్ యూనియన్ 1949 నాటికి అణుబాంబుల తయారీ సామర్ధాన్ని పెంచుకుంది. అణుబాంబు కన్నా వంద రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును 1952 నవంబరు 1న అమెరికా పరీక్షించగా, సోవియెట్ 1953 ఆగస్టు 12న హైడ్రోజన్ బాంబు తయారు చేసుకోగలిగింది. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాలు కూడా అణ్వస్త్ర పోటీలో పాలుపంచుకుంటుండడం గమనార్హం. హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే రెండువేల రెట్లు సామర్ధంగల అణు, హైడ్రోజన్ బాంబులు ఐదు వేలకు పైగా నేడు అమెరికా గిడ్డంగిలో ఉండడం విశేషం. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాల వద్ద సుమారు 10 వేల అణుబాంబులు ఉండగా, మిగిలిన దేశాలన్నిటి వద్ద సుమారు వెయ్యివరకు ఉన్నాయి. అమెరికాతో సమానంగా చైనా ఆయుధ పోటీ పెరుగుతోంది. 2020 లో కేవలం 200 అణ్వాస్త్రాలు ఉన్న చైనా 2026 నాటికి 600 వరకు పెంచుకుంది.
2035 నాటికి 1500 వరకు పెంచుకోగలదని అమెరికా అంచనా వేస్తోంది. మొత్తం అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణ్వాయుధాలను కలిగిఉన్నాయని అంచనా. మొత్తం ఈ అణుబాంబులన్నీ ప్రయోగిస్తే కొన్ని కోట్ల మంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు. ఒకే ఒక ఆధునిక థర్మో న్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్ట గలదు. అణ్వాయుధాల పరిమితి కోసం కుదిరిన ఒప్పందాలన్నిటిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలగడం ఆయన సామ్రాజ్య కాంక్ష స్పష్టమవుతోంది. 2002లో బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక (ఎబిఎం) ఒప్పందం నుంచి, 2015లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి, 2018లో జెసిపిఒఎ అనే అణుఒప్పందం నుంచి, 2019లో అమెరికా మధ్యశ్రేణి అణుక్షిపణి ఒప్పందం నుంచి, 2021లో ఓపెన్‌స్కై ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన సంఘటనలు ఉన్నాయి.
ఈ విధంగా ప్రపంచంలో అణ్వాస్త్ర ప్రమాదానికి దోహదం చేస్తున్నది అమెరికాయే. ఇజ్రాయెల్ దగ్గర 200కు పైగా అణ్వాస్త్రాలున్నా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయకపోవడం గమనార్హం. 2018లో జెసిపిఒఎ (జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్) అనే అణు ఒప్పందంలో ఇరాన్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ పాలుపంచుకున్నాయి. అయితే ఈ ఒప్పందం సరిగ్గా అమలు కావడం లేదన్న సాకుతో ట్రంప్ వైదొలిగారు. దీంతో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు పెరిగాయి. ఇరాన్ తర్వాత ఒప్పందంలో అనుమతించిన దానికంటే ఎక్కువ స్థాయిలో యురేనియం శుద్ధి చేయడం ప్రారంభించింది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. కానీ అగ్రరాజ్యం వైఖరి ఒప్పందానికి కట్టుబడడం లేదు. పైగా ఇరాన్ తదితర ప్రత్యర్థి దేశాలకు హెచ్చరిస్తున్నట్టు అనేక వ్యూహాలను రూపొందిస్తోంది. దీనికి ఉదాహరణంగా ఇటీవల సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందమే ఒక వ్యూహం.
దీని ప్రకారం సౌదీ అరేబియా తన స్వంతగడ్డపై యురేనియంను సుసంపన్నం చేసుకునే సామర్ధంతో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ ఒప్పందం ద్వారా సౌదీలో అమెరికా కంపెనీలు అణుపరిశ్రమల నిర్మాణం మరింత సులభమౌతుంది. సౌదీ అరేబియాకు దూరంగా ఉన్న ఇజ్రాయెల్‌ను కూడా ఈ సందర్భంగా సౌదీకి ట్రంప్ చేరువ చేశారు. ఇరాన్ అణుసామర్ధాన్ని నివారించడానికి విశ్వప్రయత్నం చేస్తున్న అమెరికా అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధమవుతోంది. అణ్వాయుధాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోడానికే ఇదంతా అని సమర్ధించుకుంటోంది. ఇరాన్‌తో యుద్ధం సాగిస్తుండడంతో అమెరికా వద్ద క్షిపణి నిల్వలు పడిపోతుండడం అధ్యక్షుడు ట్రంప్‌కు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా వినియోగిస్తున్న ఒక్కో క్షిపణి ధర 1.5 మిలియన్ డాలర్లకు మించి విలువైనవి. ఇంత వ్యయం అమెరికా భరించడం ఎవరి క్షేమం కోసమో అర్థం కావడం లేదు.








