
బిఎల్‌ఒలు, బిఎల్‌ఎలను సంప్రదించండి
కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా అడ్డుకోండి అని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, మత స్వేచ్ఛ, పౌర హక్కులు వంటి రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
క్విట్ ఇండియా స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ స్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నందున అందరూ ఓటు హక్కు కోసం బిఎల్‌వోలను, బిఎల్‌ఏలను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, ప్రజల ఓటు హక్కు, ప్రజల స్వేచ్ఛ, ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుండాలన్నారు. రాజ్యాంగ విలువలను బలహీనపరిచే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాలి అని అన్నారు.బ్రిటిష్ పాలనను తరిమికొట్టిన పోరాట స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని ఆయన సూచించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత అంకితభావంతో పని చేయాలన్నారు. బ్రిటిష్ పాలకులు దేశాన్ని అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన దేశ ప్రజలు వెనక్కి తగ్గలేదని, కాంగ్రెస్ నాయకత్వంలో దేశ ప్రజలు ఐక్యంగా నిలబడి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు జైళ్లకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారని, అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం కాంగ్రెస్ పోరాట చరిత్రకు ప్రతీక
క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన చారిత్రాత్మక పాత్రకు గొప్ప నిదర్శనమని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారు భారత్‌ను విడిచి వెళ్లాలని 1942లో కాంగ్రెస్ పిలుపునిచ్చిందని, దీంతో ఆ పిలుపు దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరిందన్నారు. స్వాతంత్య్రం కోసం సామాన్య ప్రజలు సైతం ఉద్యమంలో భాగస్వాములయ్యారని, ఆ పోరాట ఫలితంగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అని ఆయన వివరించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితర జాతీయ నాయకుల త్యాగాలను నేటి తరం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం అవసరం అని ఆయన తెలిపారు. నాడు బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కోసం పోరాడామని, నేడు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు పోరాడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం సాధించడంతో మన బాధ్యత పూర్తికాలేదు. స్వాతంత్య్ర సమరయోధులు ఏ విలువల కోసం పోరాడారో ఆ విలువలను కాపాడటం కూడా మన బాధ్యత. రాజ్యాంగం మన దేశానికి దిక్సూచి అన్నారు. ప్రజాస్వామ్యం మన దేశానికి బలం అని, లౌకికవాదం మన దేశ ఐక్యతకు పునాది అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల మధ్య నిరంతరం పని చేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి హక్కుల కోసం నిలబడుతూ, సామాజిక న్యాయం కోసం పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో సేవాదళ్ తెలంగాణలో మరింత చురుకుగా పనిచేయడం అభినందనీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సేవాదళ్ కార్యకర్తలు కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సేవలో ముందుండాలని ఆయన సూచించారు. మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళాలని, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో సేవాదళ్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించాలని, యువతను ప్రజాస్వామ్య విలువల వైపు నడిపించాలి అని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.











