
న్యూఢిల్లీ: ప్రధాని మోడీని ఉగ్రవాది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బిజెపి చర్యలు తీసుకోవాలని బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరింది. బుధవారం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ తదితర బిజెపి నాయకులు భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు.
అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. "మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని అవమానించినందుకు ఇసిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మేము ఎంతో బాధతో, ఆగ్రహంతో కమిషన్‌ను కలిశాము. ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం యావత్ దేశానికే అవమానం" అని పేర్కొన్నారు.
కాగా, మంగళవారం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించబడతాయని.. అంతేకాకుండా, ఇది పరువు నష్టం కేసు కిందకు కూడా వస్తుందని పేర్కొంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసిని కోరుతూ.. ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని బిజెపి విజ్ఞప్తి చేసింది.












