మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా(57) అర్ధ శతకంతో చెలరేగాడు. సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37), స్టబ్స్(27)లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీపై హైదరాబాద్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో టాస్ 3 స్థానానికి దూసుకెళ్లింది.

అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. మరోసారి ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.