
హైదరాబాద్: కెసిఆర్‌పై దుష్ప్రచారం చేసిన వారి చెంపచెల్లుమనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్‌ను నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు గెలిచారని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకునేది లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కెసిఆర్ కృషే అని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పిసి ఘోష్ కమిషన్ కాదు.. పిసిసి నివేదిక అని నేను అప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదు.. మూడు బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీపై చేసిన ఖర్చు రూ.3800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెప్తున్నా. కుంగిన ఒక్క బ్లాక్‌ను పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టి సంస్థ ముందుకొచ్చింది. అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ అని నిరూపితమవుతుంది’’ అని కెటిఆర్ అన్నారు.
విద్యుత్ కొనుగోళ్లలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ‘‘తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీరు ఎత్తిపోస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలోని చెక్‌డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. చెక్‌డ్యామ్‌లను పేలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మేడిగడ్డలో ఏం జరిగిందో విశ్రాంత జడ్జీతో మళ్లీ విచారణ జరిపించాలి’’ అని కెటిఆర్ డిమాండ్ చేశారు.














