
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు
మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్‌ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్‌గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్‌తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా అక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ అక్రమణ చట్టం 1905 ప్రకారం అక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్‌కు అధికారులు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పిర్యాదుతో బుధవారం హైడ్రా ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమణలను తొలగించింది. ఆభూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రభుత్వంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది.













