
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యేండ్లు అయినా బిఆర్‌ఎస్ పార్టీ మారదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.ఓటమిపై బిఆర్‌ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చే ర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయాయి, నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నా యకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగా ణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బిఆర్‌ఎస్ పార్టీ మారదు అని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బిఆర్‌ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి జీవన్‌రెడ్డి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రాన్ని ఏమీ అనకపోవడంలో ఆంతర్యం ఏమిటి..?
జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలి
రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందని విమర్శించారు. పార్టీల కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే దానిని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు.
కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారు
“గుంట నక్క ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలవడానికి బిఆర్‌ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా” అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సిఎం మాట్లాడారని పేర్కొన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. “ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా” అంటూ ఆయనతో సిఎం డీల్ మాట్లాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు.
ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో నిర్ణయం చేయాల్సింది ప్రజలు కదా..? ప్రశ్నించారు. పదేళ్లు తానే సిఎంగా ఉంటానని ఎలా చెబుతారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని అడిగారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని రేవంత్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు.
ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు
ఆర్‌టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్‌టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు.
తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్‌టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతిలో ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత ప్రసాద్ చేరిక
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వి ఆర్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే టిడిపి మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.













