
మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు.
ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు బండి అరుణ్ కుమార్, బి.ఆషిష్‌ను అరెస్టు చేసి ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.













