
ఐపిఎల్-2026లో ఆర్‌సిబి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్‌ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్‌ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్‌కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్‌సిబి ఇన్‌సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ షోలో మిస్టర్ నాగ్స్ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు.
‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్‌లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించు’ అని మాత్రమే అన్నా. నేనెక్కడా స్లెడ్జింగ్ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అంతా సరదాగా అన్నదే. నా స్టైల్ చూసి నేను చాలా సీరియస్‌గా ఉంటానని, నాకు కోపమెక్కువని అనుకుంటారు. కానీ, నేను అలా ఉండను’’ అని కృనాల్ స్పష్టం చేశాడు.














