
జోహెన్నస్‌బర్గ్: వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టుకు బుధవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో టి20 మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. ఇక ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఇందులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
రెండు మ్యాచుల్లోనూ టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం కావడంతో భారత్‌కు వరుస ఓటములు తప్పలేదు. ఇలాంటి స్థితిలో మూడో టి20 సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం భారత్‌కు లేకుండా పోయింది. ఆతిథ్య సౌతాఫ్రికా మాత్రం విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సఫారీ టీమ్ సిరీస్‌పై కన్నేసింది.













