
మిళనాడు అసెంబ్లీలో బుధవారం విజయ్ సారథ్య టివికె ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మెజార్టీ నిరూపణకు అవసరం అయిన విశేష సంఖ్యా బలాన్నిన దాటి విజయ్ తమ బలం నిరూపించుకున్నారు. దీనితో హీరో అయిన విజయ్ ప్రభుత్వం తొలి అడ్డంకులను అధిగమించింది. 144ః22 తేడాతో బల నిరూపణ జరిగినట్లు అసెంబ్లీ స్పీకర్ జెసిడి ప్రభాకర్ ఓటు తరువాత అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఐదుగురు తటస్థ వైఖరితో ఉన్నారు. అయితే బలపరీక్షసమయంలో ప్రధాన ప్రతిపక్షం డిఎంకె వాకౌట్‌కు దిగింది. ఇక కీలక పరిణామంగా ప్రతిపక్ష అన్నాడిఎంకెలోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్‌కు అనుకూలంగా ఓటేశారు. దీనితో ఇకపై అన్నాడిఎంకె వేర్వేరు కుంపట్లతో ముందుకు రానుంది. సి జోసెఫ్ విజయ్ నాయకత్వ ప్రభుత్వం విశ్వాస పరీక్ష లో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పడి కె పళనిస్వామి వర్గీయులు వ్యతిరేక ఓటేశారు.విజయ్ తమ చీలిక వర్గంతో బలం నిరూపించుకోవడం సమంజసమేనా అని పళనిస్వామి విమర్శించారు.
234 మంది సభ్యుల అసెంబ్లీలో మెజార్టీ బలం 118. గవర్నర్ వద్దకు విజయ్ ఈ బలంతో వెళ్లి, తరువాత ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన బలం మరింతగా పెరిగింది. బలం లేని ప్రభుత్వం ఎక్కువ కాలం నిలుస్తుందా? అనే సందేహాలను తోసిపుచ్చుతూ ఇప్పుడు అన్నాడిఎంకె వర్గం విజయ్‌కు తోడు నిలవడంతో విజయ్ ప్రభుత్వం మరింత సాఫీగా ముందుకు సాగేందుకు వీలేర్పడింది. ఇప్పటికీ మంత్రి వర్గం ఏర్పడ్డప్పటికీ ముఖ్యమంత్రి విజయ్ సహా ఎవరికీ మంత్రిత్వశాఖలను కేటాయించేదు. ఇక బలపరీక్ష నెగ్గడంతో విజయ్‌కు ఈ విషయం తరువాతి అనుకున్న సుపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. సభలో ఏకైక బిజెపి ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. పిఎంకెకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వాకౌట్ జరిపారు. ఇప్పుడు బలపరీక్ష నెగ్గడంతో విజయ్ ప్రభుత్వం పద్థతి ప్రకారం మరో ఆరునెలల వరకూ విశ్వాస పరీక్షకు దిగాల్సిన పనిలేదు. ఇప్పుడు బలపరీక్షలో కాంగ్రెస్, విసికె, వామపక్షాలు, ఎఎంఎంకె, వీరితో పాటు ఎస్‌పి వేలుమణి, సివి ఇ షణ్ముగం నాయకత్వ రెబెల్ అన్నాడిఎంకె విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఉదయం 9.30 గంటలకు సభ ఆరంభమైంది. వెంటనే ముఖ్యమంత్రి విజయ్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
అన్ని పార్టీల వారు తీర్మానంపై చర్చలో మాట్లాడారు. తరువాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం డిఎంకెకు 59 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విశ్వాస తీర్మానంపై చర్చకు విజయ్ సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం లౌకికంగా వ్యవహరిస్తుందని, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. డిఎంకె ప్రభుత్వం తీసుకువచ్చిన మంచి పథకాలను ఇక ముందు కూడా అమలు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం బలపరీక్షకు గుర్రం వేగంతో పరుగెత్తింది కానీ గుర్రాల బేరసారాలకు దిగలేదని విజయ్ చమత్కరించారు. అన్నాడిఎంకె చీలిక వర్గం నేత వేలుమణి ప్రసంగిస్తున్నప్పుడు అధికారిక అన్నాడిఎంకె సభ్యులు అడ్డుతగిలారు. దీనితో కొద్ది సేపు గందరగోళం చెలరేగింది. తరువాత సభ సాఫీగా సాగింది. తమ ప్రభుత్వానికి సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, విసికె బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయని విజయ్ సభా ముఖంగా తెలిపారు. సభలో విజయం సాధించిన విజయ్ పార్టీ సొంత బలం స్పీకర్ సహా 107గా ఉంది. బలపరీక్ష కోసం సోమవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ సెషన్ ఓటు తరువాత నిరవధికంగా వాయిదా పడింది.














