
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మ ధ్యాహ్నా భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కు వ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్‌టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ సిఎంకు నివేదిక సమర్పణ
గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు కలిసి ఈ నివేదికను సిఎం రేవంత్‌రెడ్డికి సమర్పించారు. ఈ నివేదికలో కమిటీ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. తెలంగాణలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపింది. 75 శాతం సబ్సిడీతో ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది.
గత ఏడాది ఈ సీజన్ లో 79.49 లక్షల ఎకరాలు సాగవ్వగా, ఈ ఏడాది 74.56 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయని పేర్కొంది. పత్తి పంట 45 లక్షల ఎకరాలు, సోయాబిన్ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటల సాగు ఉందని నివేదికలో తెలిపింది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో 75 నుంచి 90శాతం సబ్సిడీ అందించి డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సూచించింది. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై అందించి, పశు గ్రాస సాగును ప్రోత్సహించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని తెలిపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని సూచించింది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థికసాయం అందించాలని,
అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లీమీటర్లు కాగా, జూలై 27 నాటికి 234.80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైనట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పడిపోయినట్లు నివేదికలో వివరించింది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదించిన ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి, రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, పశుగ్రాస లభ్యత, గ్రామీణ ఉపాధి పరిరక్షణతో పాటు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత స్థిరంగా నిలబెట్టవచ్చని కమిటీ పేర్కొంది. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమవుతాయని ఈ కమిటీ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం: జి.చిన్నారెడ్డి
సిఎంకు నివేదిక అందచేసిన అనంతరం సచివాలయం మీడియా సెంటర్‌లో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రైతులకు నష్టం తగ్గించేలా నీటి వినియోగంలో పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వంటి అంశాలకు ఈ నివేదికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు ఊరటనిచ్చాయని ఆయన తెలిపారు. ఈ వర్షాలతో లభించిన తేమను, అందుబాటులోకి వచ్చిన నీటిని సమర్థవం తంగా వినియోగించుకొని ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటలను విజయవంతంగా సాగు చేసుకునేలా ప్రభుత్వం అమలు చేయదగిన ఆచరణాత్మక సూచనలను కమిటీ ప్రభుత్వానికి అందజేస్తుందని ఆయన చెప్పారు. అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.











