ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం

మళ్లీ అక్టోబర్ 29 తరువాతే మంచి రోజులు

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఆషాఢ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉన్న కుటుంబాలు.. శ్రావణ మాసం రావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నాయి. పెళ్లి సంబంధాలు ఖరారు చేసుకున్న కుటుంబాలు ముహూర్తాల కోసం పంచాంగాలను పరిశీలిస్తుండగా.. ఇప్పటికే నిశ్చయమైన వివాహాలకు కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ తదితర ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో వివాహాలకు మంచిరోజులుగా భావిస్తారు. అయితే ఈ నెల దాటితే మళ్లీ అక్టోబర్ 29 తరువాతే మంచి రోజులు ఉన్నాయని పురోహితులు చెపుతున్నారు.

ముఖ్యమైన తేదీలు ఇవే

శ్రావణా మాసం మెత్తం మంచి రోజులే అయినా కొన్ని ప్రత్యేక రోజులకు మాత్రం ప్రాధాన్యత ఉంటుంది. వివాహం కోసం తేదీలు నిర్ణయించే క్రమంలో వధువరుల జాతక చక్రాలతో పాటు మంచి రోజులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిలో ప్రధానంగా ఈ నెల 21, 22, 23, 26, 27, 28, 30, తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4, 5, తేదీలో మంచి ముహూర్తాలు ఉన్నాయిని పురోహితులు పేర్కొంటున్నారు. అయితే, గతంలో తిధి, లగ్నం, నక్షత్రం, జాతకాలు పరిశీలించి ముహూర్తం నిర్ణయించే వారు. ప్రస్తుతం వీటితో పాటు బందు మిత్రుల అందుబాటు, ఫంక్షన్ హాల్ లభ్యత వంటి వాటికి వివాహ నిర్ణయ తేదీలలో ప్రాధాన్యత పెరింగిందని పురోహితులు చెపుతున్నారు.

ముందుగానే బుకింగ్స్

శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లకు సంబంధించిన సేవలకు డిమాండ్ పెరుగుతోంది. కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్ సంస్థలు, పూల అలంకరణ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు ముందస్తు బుకింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో వివాహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీలైనంత త్వరగా ఈ తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా బంగారు ఆభరణాలు, పట్టు చీరలు, పెళ్లికొడుకు దుస్తులు, ఫ్యాన్సీ వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. పెళ్లి కుటుంబాలు ముందుగానే బడ్జెట్ రూపొందించుకుని అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి.

సంప్రదాయానికి.. ఆధునికతకు కలయిక

ఇప్పటి వివాహాల్లో సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునికతకు కూడా ప్రాధాన్యం పెరిగింది. పెళ్లి మండపాల అలంకరణలో ప్రత్యేక థీమ్స్, సంప్రదాయ పూల అలంకరణతో పాటు ఆధునిక లైటింగ్, ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్లు, డ్రోన్ వీడియోలు, డిజిటల్ ఆహ్వాన పత్రికలు వంటి వాటికి యువత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో వివాహ రంగానికి అనుబంధంగా ఉన్న అనేక వృత్తులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

శ్రావణంలో పండుగల సందడి

ప్రధానంగా శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీ వ్రతం, నాగుల పంచమి, మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ సోమవారాలు, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలతో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 17న నాగుల పంచమి, ఆగస్టు 18న మంగళగౌరీ వ్రతం, ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 28న శ్రావణ(రాఖీ) పౌర్ణమి, సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి.