
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖను సమర్పించినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన చురుకుగా ఉండటమే కాకుండా ప్రధానమంత్రి మోదీకి బలమైన మద్దతుదారుగా పేరుంది. రాజీనామా నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో బయో వివారాలు మార్చేశారు. ప్రధానికి జీవితాంతం ఫాలోవర్‌గా ఉంటానని అందులో పేర్కొన్నారు. అయితే పూనావాలా ఇన్‌స్టాగ్రామ్ బయోలో మాత్రం బీజేపీ జాతీయ ప్రతినిధిగానే ఆయన పేరు ఉంది.వృత్తి రీత్యా లాయర్, పౌరహక్కుల కార్యకర్త అయిన 38 ఏళ్ల పూనావాలా కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఆయన వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకునే ప్రక్రియ ఒక నాటకమని, అది అంతకుముందే ఖరారైందని పూనావాలా ఆరోపించారు.
పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, అర్హత ఆధారంగా కాకుండా కుటుంబ నేపథ్యంతోనే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. అప్పట్నించి ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కొనసాగారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని చాలాకాలంగా తాను అనుకుంటున్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. దాదాపు 18-19 ఏళ్లు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నానని, తన సామర్థ్యానికి తగిన పొజిషన్‌కు చేరుకున్నానని చెప్పారు.2024లో ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని అనుకున్నట్టు తెలిపారు. అయితే ఆ తర్వాత ఒకటి రెండేళ్లలో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఉన్నందున మోదీ ఎమోషన్స్ ను దృష్టిలో ఉంచుకుని తన బాధ్యతలు కొనసాగించినట్టు వివరించారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలగేందుకు ఇదే తగిన సమయమని ఇప్పుడు భావిస్తునట్టు చెప్పారు.











