రాష్ట్రంలో రాజకీయ ప్రతీకార హింసాకాండ జరుగుతోందని పశ్చిమ బెంగాల్ టిఎంసి వర్గాలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. బిజెపి గూండాలు పలు చోట్ల తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. అయితే ఇటువంటి ఘటనలతో తమకు సంబంధం లేదని బిజెపి స్పందించింది. బిజెపి విజయోత్సవ సభలు, ఊరేగింపుల దశలో పలు ప్రాంతాలలోని టిఎంసి ఆఫీసులపై దాడులు జరిగిన విషయాన్ని రాష్ట్ర పోలీసు వర్గాలు కూడా మంళవారం ధృవీకరించాయి. కోల్‌కతాలోని టోలీగుంగే , కస్బా, బరూయిపెర్, బారానగర్ , శివారు ప్రాంతాలలో రాజకీయ హింసాకాంవ చోటుచేసుకుంది. దాడులు , ఆస్తుల ధ్వంసంలో పాల్గొన్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం తెలిపింది.

తమ పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారనే వార్తలను బిజెపి నేత రాహుల్ సిన్హా తోసిపుచ్చారు. టిఎంసిలోని అంతర్గత వర్గాలే ఈ చర్యలకు పాల్పడి ఉంటాయని, పార్టీ నాయకత్వం పట్ల ఇప్పుడు అసంతృప్తి తీవ్రతరం అయినందునే దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పలు అసెంబ్లీ స్థానాలలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. రాజకీయ ప్రతీకార చర్యలు బిజెపి సంస్కృతి కాకూడదని, విజయాన్ని పద్థతి ప్రకారం ఆస్వాదించాలి తప్పితే ప్రత్యర్థులపై దాడులు సంస్కృతి అన్పించుకోదని ఢిల్లీలో సోమవారం రాత్రి విజయోత్సవ సభలో ప్రధాని మోడీ కార్యకర్దలకు పిలుపు నిచ్చారు. నాయకులకు ఈ విషయంలో మార్గ నిర్ధేశన సందేశం వెలువరించారు