
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ భూముల వివాదంలో రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేస్తూ నలుగురు రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బహదూర్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా ఆ భూముల్లో సాగు చేస్తున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మూడు దశాబ్దాలుగా ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.
భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, ఇటీవల ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల సాగు హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని వాదించారు. వివాదాస్పద భూముల్లో అధికారులు జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై వాదనలు వినిపించారు. పిటిషనర్లు తమ హక్కులను నిరూపించేందుకు చూపుతున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై సంబంధిత అధికారుల సంతకాలు లేవని కోర్టుకు వివరించారు. కేవలం కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారనే కారణంతో భూమిపై యాజమాన్య హక్కులు కల్పించలేమని పేర్కొన్నారు. వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన భూములు సర్వే నంబర్లు 28, 62 పరిధిలోని ప్రభుత్వ భూములేనని, పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్లు 3,
4లోని భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టుకు తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, రైతుల తరఫు వాదనలను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిటిషనర్లుగా ఉన్న నలుగురు రైతులు సాగు చేస్తున్నట్లు పేర్కొన్న భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో రైతులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.











