బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే గ్రూప్-1, పదవ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆయర మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విమర్శించారు. అయితే కాంగ్రెస్ హయాంలో పేపర్ల లీకులయ్యాయని బిఆర్‌ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్,

రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఏ రోజైనా మాట్లాడారా? అని ఎంపీ చామల ప్రశ్నించారు. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో నీట్ పేపర్ లీక్ జరిగిందని, జెన్ జీ రోడ్ల పైకి రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయించారని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ లో చర్చ జరగాలని లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా కేంద్రం చర్చకు అంగీకరించడం లేదన్నారు. వీటన్నింటికీ జవాబుదారీ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నించినా సమాధానం లేదని ఆయన విమర్శించారు.