
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రాకాసపాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అకాల వర్షాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నలుగురు రైతులు చనిపోయారని అన్నారు. లక్సెట్టిపేటలో మంచిర్యాల జిల్లాలో బిఆర్ ఎస్ రైతు సదస్సు జరిగింది. సదస్సులో కెటిఆర్, జీవన్ రెడ్డి, జోగురామన్న, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపాటుతో మరణించిన రైతుల కుటుంబాలను కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన రైతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సాయం చేసిందని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోలేదని, రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కెటిఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 32 నెలల్లో నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు. ఎల్లంపల్లిలో 7టిఎంసిల నీరు మాత్రమే ఉందని, బాగా వర్షం పడితే ఎస్సారెస్పీ నిండుతుందని చెప్పారు. కడెం నుంచి ఎల్లం పల్లికి నీరు వస్తుందని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. ఒక రోజు నీళ్లు లేవంటారని..రెండో రోజు మరో కథ చెబుతుతున్నారని, సిఎం కే రెండే రెండు తెలసు..ఓట్లు.. తిట్లు.. అని ఎద్దేవా చేశారు. 85 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగింది నిజమేనని, రెండు పిల్లర్లు కుంగితే తమరు రిపేర్ చేయలేరా? అని కెటిఆర్ ప్రశ్నించారు.











