హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్-నినో కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి విపత్తు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మంగళవారం పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో తన అభిప్రాయాలను అధికారిక వేదికపై చెప్పే అవకాశం ఉందని, అసెంబ్లీ సమావేశాలకు ముందే అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రచారం చేసుకోవాలని రామచంద్రరావు ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, అక్కడ అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే పూర్తి అవకాశం ఉంటుందని, బిజెపి తన వైఖరిని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల ద్వారా సభలో వెల్లడించవచ్చని, ముందుగానే గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని పొన్నం హెచ్చరించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని, మెజారిటీ ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి మాది కాదు అని, గతంలో బిజెపి ప్రభుత్వం అనేక కీలక చట్టాలను సరైన చర్చ లేకుండానే తీసుకొచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఉన్నప్పటికీ శాసనసభ, శాసనమండలి లేదా పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోవడంతో రామచంద్రరావు నిరాశలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోందని, జిహెచ్ఎంసి పరిధిలోని పేదలకు ఇళ్లు రావాలా? వద్దా? అనే విషయంలో బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంక్షేమ దృక్పథంతో చూడాలన్నారు.

ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయని చెబుతున్న బిజెపి నాయకులు, నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలని ఆ పార్టీ నాయకులకు సూచించారు. తెలంగాణకు వచ్చే నిధులు ఎవరి దయాదాక్షిణ్యంతో వస్తున్నవి కావు అని, రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో తెలంగాణకు రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని పొన్నం తెలియజేశారు. తెలంగాణ ప్రజల పన్నుల వాటా లేకుండా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా అనే విషయాన్ని బిజెపి నాయకులు ఆలోచించాలన్నారు.  ప్రజల హక్కులను ఉపకారాలుగా చూపించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని, అనవసర విమర్శలు, డొంకతిరుగుడు మాటలు మానేసి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకరావాలని, మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడంపై రాష్ట్ర బిజెపి నాయకత్వం దృష్టి సారించాలని పొన్నం సలహా ఇచ్చారు.