
కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ పాగా
బంకీపూర్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిపై ఘన విజయం
ఎన్నికల రాజకీయాల్లో బోణీ కొట్టిన జన్ సురాజ్ అధినేత
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అడ్డాలో 30 ఏళ్ల తర్వాత కమలం పార్టీకి ఓటమి
19,324 ఓట్ల ఆధిక్యంతో పికె గెలుపు
ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇది సంకేతం
విజయం తర్వాత ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్య
గుజరాత్, మధ్యప్రదేశ్‌లో బిజెపి, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలుపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠతో రేపిన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. బంకీపూర్ నుంచి పోటీ చేసిన జన్‌సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు. దీంతో బీజేపీ కంచుకోటలో ఆయన పాగా వేసినట్టయింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పీకే పాల్గొని గెలవడం, పార్టీకి సైతం ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల ఆధిక్యంతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. సిన్హాకు 44,827 ఓట్లు రాగా, ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు పోలయ్యాయి.
ఆర్జేడీ అభ్యర్థి రేఖాగుప్తా 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బంకీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా మూడుసార్లు గెలుపొందారు. నబీన్‌కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్ల తర్వాత బిజెపి ఓటమి పాలైంది. ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నిక కావడంతో బంకీపూర్‌లో ఉపఎన్నిక జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ, ఆర్జేడీ తమ ప్రచారం ప్రారంభించడానికి రెండు నెలల ముందే బంకీపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిచి ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రచారం సాగించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రభుత్వానికి బంకీపూర్ ఉపఎన్నిక ఒక రిఫరెండం అంటూ ప్రచారం చేశారు. జులై 30న ఉపఎన్నిక జరిగింది.
మార్పునకు సంకేతం: పీకే
తన గెలుపుపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ, బంకీపూర్‌లో తనను గెలిపించడం ద్వారా ప్రజలు బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ‘దయచేసి బీహార్ ముఖ్యమంత్రిగా ఒక మంచి వ్యక్తిని నియమించండి. సమర్ధుడు, నిజాయితీపరుడైన వ్యక్తిని ఎంపిక చేయండి. పరిస్థితిలు ఎలా ఉన్నా బీహార్ అభివృద్ధే ముఖ్యం ’ అని అన్నారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. బంకీపూర్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలువడమంటే బంకీపూర్‌ను రాత్రికి రాత్రి బెంగళూరు చేస్తానని కాదని, అయితే రాబోయే కొద్ది నెలల్లోనే బంకీపూర్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా చూస్తారని హామీ ఇచ్చారు.
దతియాలో కాంగ్రెస్, మంజల్‌పూర్‌లో బీజేపీ గెలుపు
కాగా, బంకీపూర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దతియాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, మంజల్‌పూర్‌లో బీజేపీ గెలుపొందింది. దతియాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ ప్రత్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. చీటింగ్ కేసులో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి మూడేళ్ల జైలుశిక్ష పడటం, అసెంబ్లీ సభ్యత్వం కోల్పోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, గుజరాత్‌లోని మంజల్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై 30,630 ఓట్ల ఆధిక్యంతో పటేల్ విజయం సాధించారు.








