కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ నిట్టనిలువునా చీలింది. ఈ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ రెబెల్ ఎంపిలు బిజెపిలో అధికారికంగా విలీనం అయ్యారు. వీరి విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సోమవారం తెలిపారు. ప్రస్తుత పరిణామంతో కేజ్రీవాల్ పార్టీ బలం ఎగువ సభలో కేవలం మూడుకు చేరింది. ఇదే దశలో అధికార పక్షం బిజెపి సంఖ్యాబలం రాజ్యసభలో 113కు చేరుకుంది. ఇప్పుడు ఆప్ వీడి , బిజెపిలో చేరిన ఎంపిలలో రాఘవ ఛద్ధా, అశోక్ మిట్టల్, హర్బజన్ సింగ్ (క్రికెటర్), విక్రమ్‌జిత్ సాహ్నే, స్వాతీ మాలివాల్, రాజీందర్ గుప్తా ఉన్నారు. వీరంతా కూడా ఆప్‌లో సీనియర్ నేతలే. వీరి బిజెపి చేరిక తరువాత రాజ్యసభ సెక్రెటెరియట్ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ ఏడుగురిని బిజెపి సభ్యుల జాబితాలో చేర్చుతూ తాజా వివరణ ఇచ్చింది. ఈ ఏడుగురు ఎంపీలు కూడా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ క్రమంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇక ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఆప్ ఎంపిలలో ఇద్దరు ఆప్‌లో ఉన్నారు. వీరు సంజయ్ సింగ్, ఎనడి గుప్తా, ఇక స్వాతీమాలీవాల్ బిజెపిలోకి వెళ్లారు. బిజెపిలోకి చేరిన ఏడుగురు ఆప్ ఎంపీలకు స్వాగతం చెపుతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ తెలిపారు. ఈ ఎంపిలు తుక్డే తుక్డేల ఇండియా కూటమికి వీడ్కోలు చెప్పి చాలా మంచిపనిచేశారని వ్యాఖ్యానించారు. మంత్రి ఈ ఎంపిల మధ్య స్వీట్ల పంపిణీ జరిగింది. ఆదివారం ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ ఎంపీల చర్యను ఖండించారు. వీరిని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు దరఖాస్తు చేశారు. అయితే దీనిపై రాజ్యసభ ఛైర్మన్ నుంచి స్పందన వెలువడలేదు.ఈ రోజు ఈ ఎంపీలు బిజెపిలో విలీనం అయిన విషయం ప్రకటించారు. పార్టీ నేత కేజ్రీవాల్ వ్యవహార శైలికి నిరసనగా ఎంపిలు పార్టీ వీడినట్లు స్వయంగా ప్రకటించారు.