ఒమన్ తీరానికి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు లక్షంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. షినాస్ పోర్టు సరిహద్దుకు సమీపంలో టోగో దేశ జెండా కలిగిన నౌక ఎమ్‌టి సిరోన్‌పై ఏప్రిల్ 25న ఈ దాడి జరిగిందని తెలిపింది.ఇరాన్ టార్గెట్ చేసిన నౌకలో భారత సిబ్బంది కూడా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్‌దీప్ సింగ్ రణ్‌ధావా తెలిపారు. ఇతర నౌకలతో పాటూ వెళుతున్న ఎమ్‌టి సిరోన్ నౌకను ఇరాన్ కోస్ట్ గార్డు దళాలు అడ్డగించి హెచ్చరికగా కాల్పులు జరిపాయని చెప్పారు. అయితే, నౌకలో భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. విదేశాంగ శాఖతో పాటూ ఇతర వర్గాల సమన్వయంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు.