
ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 12 గంటల వ్యవధిలో వరుసగా మరణించడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనకు ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల జైనబ్, ఆమె అక్క, తల్లిదండ్రులు శనివారం రాత్రి బిర్యానీ విందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆదివారం తెల్లవారుజామున వారికి తీవ్ర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా మృతి చెందారు.
బిర్యానీ విందు తర్వాత విషాదం
అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్ (40) అనే స్థానిక వ్యాపారి మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నిర్వహించేవాడు. ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు జైనబ్ (13), ఆయేషా (16)తో కలిసి మరో ఐదుగురు బంధువులతో శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు విందులో పాల్గొన్నారు. ఆ విందులో బిర్యానీ వడ్డించారు. విందు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు పైధోనిలోని తమ ఇంటికి వెళ్లారు. అప్పటివరకు ఎవరికీ ఆరోగ్య సమస్యలు కనిపించలేదని సమాచారం. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మొదట స్థానిక వైద్యుడు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారిని సర్‌జెజె ఆసుపత్రికి తరలించారు.
చిన్న కుమార్తె జైనబ్ ఉదయం 10:15 గంటల సమయంలో మృతి చెందింది. అనంతరం ఆమె తల్లి నస్రీన్ (35), అక్క ఆయేషా (16) కూడా చికిత్సకు స్పందించకుండా ప్రాణాలు కోల్పోయారు. తండ్రి అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్ రాత్రి 10:30 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను మొదట పరీక్షించిన వైద్యుడు డాక్టర్ జియాద్ ఖురేషీ మాట్లాడుతూ, వారు ఆసుపత్రికి చేరేసరికి తీవ్రంగా అలసిపోయి, అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వారికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించే సమయంలో వారు పుచ్చకాయ తిన్నట్లు చెప్పారు అని ఆయన వివరించారు.
అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు
ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల మృతిపై పోలీసులు అనుమానాస్పద మరణాల కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 12 గంటల వ్యవధిలో జరిగిన ఈ వరుస మరణాలకు ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన సగం తిన్న పుచ్చకాయ ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. పోస్టుమార్టం సమయంలో మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను కూడా తదుపరి విచారణ కోసం భద్రపరిచాం అని ముంబయి పోలీస్‌డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ ముండే తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణులు, ఆహార భద్రత శాఖ అధికారులు కూడా పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు తిన్న పుచ్చకాయలో ఏదైనా విషపూరిత పదార్థం లేదా కల్తీ పదార్థాలు ఉన్నాయా అనే అంశంపై రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. మరోవైపు ఫోరెన్సిక్ బృందం ఆహార నమూనాలు, విసెరా నివేదికల ఆధారంగా మరణాల కారణాలను విశ్లేషిస్తోంది. సర్‌జెజె ఆసుపత్రిలోని మైక్రోబయాలజీ విభాగం బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ఉనికిని పరీక్షిస్తోంది. అలాగే శరీర కణజాల నమూనాలపై హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహించనున్నారు. హిస్టోపాథాలజీ నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు ఖచ్చితమైన కారణంపై తుది అభిప్రాయం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.














