
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ డిజిపి సివి ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సి ఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మ హిళా ఐపిఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డిజిపి నిర్ణయించారు. కూకట్‌ప ల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృం దం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. బాధితురా లు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోప ణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లో పాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని ప్రారంభించింది. పోలీసులు బాలిక స్టేట్మెంట్ ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డ్ చే శారు.
ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా సిసిటివి ఫుటేజీలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు కూడా పరిశీలించే అవకాశముంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజ కీయ ప్రకంపనలు మొదలయ్యాయి. పోలీసులు పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. బాలికకు సంబంధించిన కేసు కావడంతో చట్టపరమైన ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా అమలు చేస్తున్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో ఎక్కడా పక్షపాతం ఉండదని, బాధితు రాలికి న్యాయం జరిగేలా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
ఎవరీ రితిరాజ్...!
కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ప్రస్తుతం పోలీస్ శాఖలో కఠినంగా విధులు నిర్వర్తించే అధికారిణిగా గుర్తింపు పొందారు. ఆమె స్వస్థలం బీహార్ రాష్ట్రం. పాట్నాలో పెరిగిన రితిరాజ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారిణి అయిన రితిరాజ్ తెలంగాణ కేడర్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. రితిరాజ్ అవినీతి నిరోధక శాఖలో కూడా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ అవినీతి వ్యవహారాలపై కఠినంగా చర్యలు తీసుకున్న అధికారిణిగా గుర్తింపు పొందారు. 2025 సెప్టెంబర్ 29న మాదాపూర్ జోన్ డిసిపిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ప్రస్తుతం కూకట్‌పల్లి డిసిపిగా కొనసాగుతున్నారు. రాజకీయంగా సున్ని తమైన కేసులను కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టప్రకారం దర్యాప్తు చేసే అధికారిణిగా ఆమెకు పేరుంది. లా గ్రాడ్యుయేట్ కావడం, ఐపిఎస్ శిక్షణ పొందడం వల్ల పోక్సో వంటి సున్నితమైన కేసుల్లో చట్టపరమైన అంశాలను సమర్థంగా నిర్వహించగలరనే నమ్మకంతోనే ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.
బండి భగీరథ్‌పై పోక్సో కేసు విచారణ ముమ్మరం.. రంగంలోకి దిగిన సిట్ అధికారిణి రితిరాజ్!
మన తెలంగాణ/ పేట్ బషీరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందం (సిట్) ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విచారణ అధికారిణి, కూకట్‌పల్లి ఉప కమిషనర్ రితిరాజ్ సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సహాయ రక్షకభట కమిషనర్‌తో కలిసి కేసు పురోగతిపై ఆమె సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వాంగ్మూలాన్ని త్వరలోనే నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. నిందితులు ఎంతటివారైనా సరే, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారిణి పేర్కొన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు.














