
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎఐసిసి, టిపిసిసి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. నిరసనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎంపి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను లాఠీలు ఝులిపించి చెదరగొట్టి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిసిసి కార్యాలయాలనికి వెళ్లేందుకు సిద్ధమైన బిజెపి రాజేందర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంపి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అప్రమత్తమైన బిజెపి శ్రేణులు, బిజెపి కార్పొరేటర్లు, కార్యకర్తలు ఎంపి కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్, బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలపై బిజెపి శ్రేణుల దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ కాసేపట్లో డిసిసి కార్యాలయంవైపు వెళ్లేందుకు బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు











