
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఘోర పరాజయంతో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని తేలిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా ఇంటి దారి పట్టాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బంకిపూర్ ఉప ఎన్నిక తీర్పు బిజెపి అహంకారానికి గట్టి దెబ్బ అని ఆయన సోమవారం ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని దతియ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామిక విజయం అన్నారు. బీహార్‌లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, ఇది దేశ రాజకీయాల్లో ఒక కీలక మార్పుకు తెర లేపిందని ఆయన తెలిపారు.
కేంద్రంలోనూ, బీహార్‌లోనూ అధికారంలో ఉన్న బిజెపి నియంతృత్వ విధానాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లోగడ ప్రాతినిథ్యం వహించారని, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లడంతో రాజీనామా చేశారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బిజెపికి కంచుకోటగా ఉన్న ఈ స్థానం ప్రజల తీర్పుతో చేజారడం అధికార అహంకారానికి ఎదురుదెబ్బ అన్నారు.
ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులు, సామాజిక విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఎంత బలమైన రాజకీయ కోట అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని బంకిపూర్ మరోసారి నిరూపించిందని ఆయన తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే ప్రచారం కాదు, పాలనలో ఫలితాలు చూపాల్సిందేనని ఈ తీర్పు చెబుతోందన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారని తమ పార్టీ వైపు చూస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.








