
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని, పంట కొనుగోళ్లలోనూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని హరీశ్‌రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సిఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని హరీశ్‌రావు ఈ లేఖలో ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500ల బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని హరీశ్‌రావు ఆయన అన్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శెనగలకు మద్దతు ధర రూ. 5,875లు ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని హరీశ్‌రావు ఈ లేఖలో ప్రశ్నించారు. కనీస మద్దతు ధర రూ. 3371లు ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2,500లకే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామన్న నిబంధనను సడలించాలని హరీశ్‌రావు సూచించారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.













