సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ వద్ద ఇటీవల జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ప్లాస్టిక్ బకెట్‌లో సుమారు 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు గుర్తించారు.
బుధవారం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బందికి ఫైరింగ్ రేంజ్ వెనుక భాగంలో ఓ ప్లాస్టిక్ బకెట్ కనిపించింది. అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్ డిస్పోజల్ టీమ్‌ను రంగంలోకి దించారు.
పరిశీలించగా బకెట్‌లో మొత్తం 8 బండిళ్లలో 160 డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ వాటిని సురక్షితంగా తరలించగా.. డిటోనేటర్లు అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు వదిలి వెళ్లారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్మీ ఆయుధాల చోరీతో సంబంధం ఉందా?
డిటోనేటర్లు దొరికిన ప్రాంతం.. ఇటీవల ఆయుధాల చోరీ జరిగిన ఆర్మీ పరిసరాలకు సమీపంలో ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు ఘటనలకు ఎలాంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. డిటోనేటర్లు ఆర్మీ ప్రాంతంలో కాకుండా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిధిలో లభించాయి. ఇవి ఆర్మీకి చెందినవి కావని, గతంలో పెద్ద రాళ్లను పేల్చేందుకు ల్యాండ్ డెవలపర్లు ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయినప్పటికీ డిటోనేటర్లను అక్కడ ఎవరు వదిలారు? వాటి అసలు మూలం ఏమిటి? ఏ అవసరానికి ఉపయోగించారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కొనసాగుతున్న ఆర్మీ ఆయుధాల చోరీ దర్యాప్తు
ఇదిలా ఉంటే.. బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆగస్టు 31న గుర్తించిన ఈ చోరీలో ఐదు అసాల్ట్ రైఫిళ్లు, ఏడు పిస్టళ్లు, 21 మ్యాగజైన్లు, భారీగా మందుగుండు సామగ్రి, నైట్ విజన్ పరికరం మాయమైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వీటిలో AK-203 రైఫిళ్లు, INSAS రైఫిల్ కూడా ఉన్నాయి.
ఆయుధాలు భద్రపరిచిన ప్రాంతం నుంచి అవి ఎలా బయటకు వెళ్లాయి? ఈ ఘటనలో బయట వ్యక్తుల పాత్ర ఉందా? లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు, ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఈ విచారణలో చేరింది.
ఆర్మరీకి అనుమతితో ప్రవేశం ఉన్న సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ, యాక్సెస్ రికార్డులు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి 160 డిటోనేటర్ల వ్యవహారాన్ని, ఆర్మీ ఆయుధాల చోరీని వేర్వేరు ఘటనలుగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు బయటపడలేదు.








