బ్రిటన్ ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. తన వారసుడి ఎంపికకు సంబంధించిన కాలపట్టికను కూడా వెల్లడించారు. రాబోయే వారాల్లో కొత్త నాయకుడిని ఎన్నుకుని, సెప్టెంబర్ నాటికి ఆయన బాధ్యతలు చేపట్టేలా ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 63 ఏళ్ల స్టార్మర్, కొత్త లేబర్ పార్టీ నాయకుడు, ప్రధాని ఎన్నికయ్యే వరకు తాను పదవిలో కొనసాగుతానని, అధికార బదిలీ సజావుగా జరిగేలా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. నా తర్వాత బాధ్యతలు చేపట్టే నాయకుడికి సంపూర్ణ మద్దతు ఇస్తాను అని స్పష్టం చేశారు.డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై మాట్లాడిన స్టార్మర్ భావోద్వేగానికి లోనయ్యారు. తదుపరి సాధారణ ఎన్నికలకు పార్టీని నేను నడిపించాలా లేదా అన్న ప్రశ్నకు నా పార్లమెంటరీ పార్టీ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానాన్ని నేను గౌరవంగా అంగీకరిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ దేశ ప్రయోజనాల కోసమే. అందుకే లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు.

ఈ నిర్ణయం గురించి సోమవారం ఉదయం రాజు చార్లెస్-3కు సమాచారం ఇచ్చినట్లు స్టార్మర్ తెలిపారు. ఇప్పుడు లేబర్ పార్టీ జాతీయ కార్యవర్గం (ఎన్‌ఈసీ) కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియను ఖరారు చేయనుంది. జూలై 9 నుంచి నామినేషన్లు ప్రారంభమై, పార్లమెంట్ వేసవి విరామం మొదలయ్యే జూలై 17 నాటికి ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. ఒకవేళ పోటీ జరిగితే, సెప్టెంబర్‌లో పార్లమెంట్ తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త నాయకుడు బాధ్యతలు చేపడతారని స్టార్మర్ చెప్పారు. పోటీ పూర్తయ్యే వరకు నేను ప్రధానిగా కొనసాగుతాను. అధికార బదిలీ క్రమబద్ధంగా జరిగేలా నా వంతు కృషి చేస్తాను అని తెలిపారు. స్టార్మర్ వారసత్వ పోటీలో ఆండీ బర్నమ్ ముందంజలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఉపఎన్నికలో గెలిచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు తిరిగి వచ్చిన ఆయన, ఈ ప్రక్రియలో నేను కూడా పోటీకి సిద్ధం అని సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.


గత 2024 జూలై సాధారణ ఎన్నికల్లో స్టార్మర్ లేబర్ పార్టీకి ఘన విజయం అందించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు తొలుత మంచి ప్రజాదరణ లభించినా, ఇటీవల కొన్ని వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఆయన ప్రజాదరణ తగ్గింది. తన పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ స్టార్మర్ గత రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, పెట్టుబడులు రావడం, మౌలిక వసతుల నిర్మాణం, ద్రవ్యోల్బణంతో పోలిస్తే వేతనాలు పెరగడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. లేబర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మార్పును అమలు చేసింది అని అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం తాను స్వీకరించిన లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా క్షీణించిన స్థితిలో ఉందని, కానీ ఆ పార్టీని పునర్నిర్మించి గత ఎన్నికల్లో 174 సీట్ల మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చామని స్టార్మర్ చెప్పారు. పదవి వీడిన తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నట్లు స్టార్మర్ పేర్కొన్నారు.

ఈ దేశంలోనే అతిపెద్ద బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత అయిన మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తాను అని చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. లేబర్ నాయకత్వ పోటీలో నిలవాలంటే కనీసం పార్టీ ఎంపీలలో 20 శాతం మద్దతు ఉండాలి. అదనంగా, కనీసం 5 శాతం నియోజకవర్గ లేబర్ పార్టీ యూనిట్లు లేదా మూడు అనుబంధ కార్మిక సంఘాలు/లేబర్ సంస్థల మద్దతు కూడా ఉండాలి. స్టార్మర్ రాజీనామాతో గత పదేళ్లలో బ్రిటన్‌కు ఇది ఏడో ప్రధాని ఎంపిక ప్రక్రియగా నిలిచింది.