
లక్నో: లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఒక బ్యాంకు ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య, రక్తం పంచుకుని పుట్టిన సోదరిని తుపాకితో కాల్చి చంపి, అనంతరం తనను తాను తుపాకితో కాల్చుకుని మృతి చెందిన ఘటన గురువారంనాడు కలకలం సృష్టించింది. ఎస్బీఐలో మానస్ మిశ్రా ఉద్యోగం చేస్తుండగా, ఐసీఐసీ బ్యాంకులో అతని భార్య దివ్వ మిశ్రా రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఐసీఐసీ శాఖ వెలుపల ఈ ఘటన జరిగింది. మానస్ తన భార్యకు ఫోన్ చేసి, ఆమెను కాల్చిచంపిన అనంతరం పరారయ్యాడు. ఆ వెంటనే ఘటనాస్థలికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హుసారియాలో ఉన్న తన సోదరి షీబా బాజ్‌పేయి ఇంటికి వెళ్లి ఆమెను కాల్చిచంపాడు.
అనంతరం తనపై కాల్పులు జరుపుకొన్నాడు. దీనికి ముందు మానస్ మిశ్రా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి, తన భార్య తనను మోసం చేసిందనే కారణంతో హత్య చేసినట్టు ఆరోపించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 3 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ వివాదమే ఈ హత్యలకు కారణంగా కనిపిస్తోందని పోలీస్ కమిషనర్ తరుణ్ గౌబా చెప్పారు. ముగ్గురు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి తదుపరి దర్యాప్తును చేపట్టారు











