నేటి భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఒక క్లిష్టమైన సంధి కాలంలో ఉంది. దశాబ్దాల పాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన దేశం, నేడు ‘ఒకే దేశం -ఒకే సంస్కృతి’ అనే నినాదం వెనుక తన వైవిధ్యాన్ని కోల్పోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర పుటలను తిరగేస్తే, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పాలకులు అనుసరించే మార్గాలు కాలంతోపాటు మారుతుంటాయి. 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన రాజనీతి తత్వవేత్త నికోలో మాఖియావెలి తన ప్రసిద్ధ గ్రంథం ‘ది ప్రిన్స్’ (The Prince) ద్వారా రాజకీయాలను మతం, నైతికత నుండి వేరు చేసి, ‘రాజకీయ లౌకిక వాదానికి’ పునాది వేశారు. కానీ, నేటి భారతదేశంలో నరేంద్ర మోడీ హయాంలో రాజకీయాలు మళ్లీ మతంతో ముడిపడి, ఒక విలక్షణమైన మలుపు తిరుగుతున్నాయి. ఈ పరిణామం రాజ్యాంగ వ్యవస్థల పతనం వైపు దారి తీస్తోందా? భారతీయులను ఆధునిక యుగం నుండి మధ్య యుగపు ఆలోచనా ధోరణిలోకి నెడుతోందా? అన్నది నేడు మేధావుల ముందున్న ప్రధాన ప్రశ్న. మాఖియావెలి కంటే ముందు, పాలన అనేది దైవ కార్యంగా భావించబడేది. మాఖియావెలి దానిని తలకిందులు చేశారు. ‘పాలన అనేది వాస్తవికత మీద ఆధారపడి ఉండాలి, ఆదర్శాల మీద కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. మాఖియావెలి మతాన్ని వ్యక్తిగత విషయంగా చూశారు. రాజకీయాలలో మతాన్ని కేవలం ప్రజలను నియంత్రించే ఒక ‘సాధనం’గా మాత్రమే వాడాలని సూచించారు తప్ప, మతమే రాజకీయంగా మారకూడదన్నారు. ‘ఒక పాలకుడు దయాగుణం, విశ్వాసం, మానవత్వం, మత విశ్వాసం కలిగి ఉన్నట్టు కనిపించడం అవసరం, కానీ వాటిని నిజంగా కలిగి ఉండటం ప్రమాదకరం అన్నారు. మాఖియావెలి రాజకీయాల నుండి మతాన్ని వేరు చేయాలని చెబితే, నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి మతాన్ని రాజకీయాలకు ప్రధాన ఇంధనంగా మార్చుకుంది. ‘మతం అనేది వ్యక్తిగత విశ్వాసం కావాలి, కానీ అది అధికార పీఠానికి నిచ్చెనగా మారినప్పుడు... మానవత్వం మంటగలిసి, మతోన్మాదం రాజ్యమేలుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషర్లు వాడిన విభజించు - పాలించు సూత్రాన్ని, నేడు మతం ప్రాతిపదికన ఓటర్లను చీల్చడానికి ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రత్యర్థులను శత్రువులుగా, ఒక వర్గం ప్రజలను పరాయి వారుగా చిత్రించడం ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తోంది. రాజకీయాలకు మతం తోడైనప్పుడు, తటస్థంగా ఉండాల్సిన వ్యవస్థలు ప్రభావితమవుతాయి. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మీడియా వంటి ప్రజాస్వామ్య స్తంభాలు మతపరమైన భావోద్వేగాల ముందు తలవంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ‘సెక్యులరిజం’ (లౌకికవాదం) అనే ఆత్మ క్రమంగా క్షీణిస్తోంది. భారత రాజ్యాంగం ‘లౌకిక వాదం’ మీద నిలబడింది. కానీ నేడు వ్యవస్థలన్నీ ఒకే భావజాలం కిందకు వెళ్తున్నాయి. ఇసి, సిబిఐ, ఇడి వంటి స్వతంత్ర సంస్థలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయి, నిర్వీర్యం అవుతూ అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారాయన్నది బహిరంగ రహస్యం.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు, మేధావులను ‘దేశ ద్రోహులు’గా ముద్ర వేయడం, భావప్రకటనా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపడంతో మనుగడలో ఉన్న ప్రజాస్వామ్యానికి మరణశాసనం లిఖించబడుతుంది. ఆధునిక భారతంలో ‘మనువాదం’ మళ్లీ కొత్తరూపంలో ప్రవేశిస్తోంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలపట్ల పెరుగుతున్న హింస, వివక్ష దీనికి నిదర్శనం. రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని కాలరాస్తూ, వర్ణ వ్యవస్థలోని ఆధిపత్య పోకడలను పరోక్షంగా ప్రోత్సహించడం ఆందోళనకరం మనువాద పోకడలతో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అధికారం కోసం బిజెపి అనుసరిస్తున్న వ్యూహాల్లో మతపరమైన హింస ఒక భాగంగా మారింది. అధికార దాహంతో హింస పెరిగిపోతుంది. అల్లర్లు సృష్టించడం ద్వారా ప్రజల మధ్య అగాధాన్ని పెంచి, ఆ అభద్రతా భావం నుంచి ఓట్లను పిండుకోవడం ఒక విష సంస్కృతికి తెరలేపింది. మత ఘర్షణలు కేవలం ప్రాణాలను తీయడమే కాకుండా, దేశ ఆర్థిక, సామాజిక ఐక్యతను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. మాఖియావెలి చెప్పినట్టు, అధికారాన్ని కాపాడుకోవడానికి పాలకుడు ఏదైనా చేయవచ్చు (The end justifies the means). కానీ మోడీ మతాన్ని ఉపయోగించి ప్రజామోదాన్ని పొందుతూ, రాజ్యాంగ నియమాలను తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. నేటి పరిస్థితులు అంబేద్కర్ భయపడిన ఆ రోజులను గుర్తుచేస్తున్నాయి. సంప్రదాయాల పేరుతో అణచివేతను సమర్థించే ధోరణి పెరుగుతోంది. ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దానిని అమలు చేసే వ్యక్తులు దుర్మార్గులైతే అది విఫలమవుతుంది. డా. బి.ఆర్. అంబేద్కర్ ఒక దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా, సామాజికంగా వెనక్కి వెళ్తుంటే ఆ అభివృద్ధికి అర్థం లేదు. మతం మనిషికి శాంతిని ఇవ్వాలి, కానీ రాజకీయాలకు ఆయుధంగా మారకూడదు. ప్రజలను విద్య, వైద్యం, ఉపాధి వంటి ఆధునిక సమస్యల వైపు కాకుండా, గత చరిత్రలోని గొడవలు, మతపరమైన ఆధిపత్యం వైపు మళ్లించడం ద్వారా దేశాన్ని ‘మధ్యయుగపు మత బానిసత్వం’ వైపు తీసుకెళ్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. భారతదేశం అంటే కేవలం భూభాగం కాదు, కోట్లాది మంది ప్రజల నమ్మకం, వైవిధ్యం. మతం పేరుతో దేశాన్ని విడదీయడం, రాజ్యాంగ విలువులను పక్కన పెట్టడం భావి తరాలకు మనం ఇచ్చే చేదు బహుమతి. మేధావులు, యువత, సామాన్య ప్రజలు నిద్ర మేల్కోవాల్సిన సమయం ఇది. ‘ప్రజాస్వామ్యంలో మౌనం అనేది నిరంకుశత్వానికి ఇంధనం వంటిది. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి ప్రాణం’ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడమే. మత రాజకీయం తాత్కాలికంగా అధికారాన్ని ఇవ్వవచ్చు, కానీ అది దేశ ఆత్మను చంపేస్తుంది. ‘మతం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, అది మతాన్ని భ్రష్టు పట్టిస్తుంది, రాజకీయాలను విషపూరితం చేస్తుంది.’ నేటి భారతీయులు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామా? లేక మతపరమైన ఉద్వేగాల మధ్య బందీలుగా మారుతున్నామా? అంధవిశ్వాసాల నుండి బయటపడి, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకున్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.