సింగపూర్ మాజీ ప్రధాని, సీనియర్ మంత్రి లీ సియెన్ లూంగ్ ఖండన

నేపాల్ వరదల తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్ల విద్వేష వ్యాఖ్యలు

14 వివాదాస్పద పోస్టుల తొలగింపునకు ఆదేశాలు

సింగపూర్ సిటీ : నేపాల్ వరద దుర్ఘటన తదనంతర పరిణామాల్లో సింగపూర్‌లోని భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న వర్ణవివక్ష, విద్వేషపూరిత ప్రచారాన్ని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సియెన్ లూంగ్ తీవ్రంగా ఖండించారు. మానవతా దృక్పథంతో స్పందించాల్సిన విపత్తు సమయంలో ఇలాంటి జాతి విద్వేష వ్యాఖ్యలు వెలువడటం అత్యంత ఆందోళనకరమని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయాల్లో ప్రజలంతా విభేదాలను పక్కనపెట్టి, విద్వేషాలను తిరస్కరిస్తూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

నేపాల్‌లో గల్లంతైన తొమ్మిది మంది సింగపూర్ పౌరుల జాతీయతను ప్రశ్నిస్తూ, అలాగే సింగపూర్ ఎయిర్‌లైన్స్-ఎయిర్ ఇండియా పెట్టుబడుల వ్యవహారాన్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో భారత సంతతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున విష ప్రచారం జరిగింది. ‘సింగపూర్‌ను భారతీయులు ఆక్రమిస్తున్నారు‘ అని చిత్రీకరిస్తూ, అనుచిత పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై సింగపూర్ యంత్రాంగం కఠినంగా స్పందించింది. పౌరుల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న 14 వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులను తక్షణమే తొలగించి, వాటికి నిరోధించాలని డిజిటల్ అభివృద్ధి, సమాచార మంత్రిత్వ శాఖ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది.

ఈ అంశంపై లీ సియెన్ లూంగ్ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. ఏ సమాజంలోనైనా జాతి, మతం అత్యంత సున్నితమైన అంశాలని పేర్కొన్నారు. ‘మానవులు స్వతహాగా పూర్తి జాతి-రహితంగా ఉండలేరు. సామాజిక విభజనలు ఎల్లప్పుడూ సవాలుగానే ఉంటాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతమైన నేతలు గళమెత్తి విద్వేషాలను తిప్పికొట్టాలి‘ అని స్పష్టం చేశారు. దేశంలో బహుళత్వ ప్రతిపత్తిని, సామరస్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేయాలని కోరారు.

అంతకుముందు, హోం మంత్రి కె. షణ్ముగం కూడా ఈ తరహా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతీయ సంస్కృతి, ఆహార అలవాట్లను హేళన చేస్తూ కామెంట్లు చేయడం అత్యంత సిగ్గుచేటని అభివర్ణించారు. సమాజంలో ఇటువంటి ప్రవర్తన సాధారణ విషయంగా మారకముందే పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.