
ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింట్లో ఉంటోంది. ఇదిలా ఉంటే గ్రామంలొ సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్‌బిఐ బ్యాంకుకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి రజినితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో అంతకు ముందు రజిని కుమార్తె తన తల్లిపై ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, విచారణ నిమిత్తం పోలీసులు రజినిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీస్‌స్టేషన్‌కు రజిని వెళ్లడాన్ని గమనించిన రాంబాబు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రజినికి తీవ్ర రక్తస్రావమైంది. పోలీసులు వెంటనే ఆమెను ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల పూర్తి కారణాలు, కుటుంబ వివాదాలపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడంతో ఏన్కూరు పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని క్రైం నెం. 152/2026, యూ/సెక్షన్.109, 85 బిఎన్‌ఎస్ అండ్ సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భూక్యా రాంబాబును అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు ఎస్ఐ నారబోయిన సంధ్య తెలిపారు.
ఫొటో నెం.20ఏన్కూరు01ఃతీవ్రంగా గాయపడిన మహిళ
ఫొటో నెం.20ఏన్కూరు02ఃనిందితుడు అరెస్ట్











