
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న దర్గా ఆవరణలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారంనాడు అనుమతించింది. వివాదాస్పద ప్రాంతానికి పక్కన ముస్లింలకు కొంత స్థలాన్ని ప్రార్థనల కోసం కేటాయించాలని, ఆ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్‌శాల ఆలయ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురావస్తు శాఖలు ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం నమాజ్‌లకు ధార్‌లోని వివాదాస్పద స్థలానికి పక్కన వేరే ఓపెన్ స్పేస్ కేటాయించాలని జూలై 14న బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రత్యామ్నాయ స్థలం విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ధార్ యంత్రాంగం పాటించలేదని, వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌కు్ 1.3 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించిందని ముస్లిం వర్గానికి చెందిన హాజీ మనీర్ అహ్మద్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కాగా, వివాదాస్పద భోజ్‌శాల-కమలా మౌలా మసీదు ఆవరణలో సరస్వతీ దేవి ఆలయం ఉదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు మే 15న ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.











