
భార్య భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపిన సంఘటన నిజామాబాద్ నగర శివారు ప్రాంతమైన న్యాల్కల్ లో చోటుచేసుకుంది. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అతను లేని సమయంలో అతని భార్య సంధ్య, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుండి తిరిగి రావడంతో సంధ్య తన అక్రమ బంధానికి భర్త అడ్డుగా మారాడని భావించింది. భర్తను వదిలించుకోవడానికి సంధ్య తన ప్రియుడు మరియు స్థానికుడైన వెంకట సాయితో కలిసి ప్లాన్ వేసింది. భర్త ప్రశాంత్‌కు మందు తాగించి భవనంపై నుంచి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో ఎవరూ లేని సమయం చూసి బాత్రూమ్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా అతని నరాల్లోకి ఎక్కించింది. కెమికల్ శరీరం మొత్తం పాకడంతో అవయవాలు విఫలమై ప్రశాంత్ తీవ్ర నరకయాతన అనుభవిస్తూ ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ప్రశాంత్ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు వెంకట సాయిని అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారించడంతో ఈ భయంకరమైన నిజం బయటపడింది. ప్రస్తుతం భార్య సంధ్యతో పాటు ఈ హత్యకు సహకరించిన మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












