గత నాలుగు రోజులుగా బాయి బాట కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథనిలోని బొగ్గుబాయిలను సందర్శించామని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంత వనరులను శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు దోపిడికి పాల్పడితే, రాష్ట్ర స్థాయిలో వీరికి భట్టి విక్రమార్క తోడయ్యారు. ఈ ముగ్గురు బందిపోటు దొంగలు ప్రజల సమస్యలను వదిలి అక్రమ సంపాదన మీద పడ్డారన ఆమె విమర్శించారు. శ్రీధర్‌బాబు విషయంలో ఆయన తమ్ముడు శ్రీనుబాబు పెత్తనం చెలాయిస్తున్నాడని, భట్టి విక్రమార్క వాళ్ల కుటుంబసభ్యులు అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ లంచం అడుగుతున్నారని ఆమె విమర్శించారు.

బై వన్ గెట్ వన్ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి మన కు ఈ పరిస్థితి దాపురించిందని ఆమె అన్నారు. వీళ్లు ప్రజలను పట్టించుకోకుండా ఇసుక, మట్టి, బూడిద దందా చేస్తున్నారన్నారు. మేము బాయిబాట పట్టగానే బీజేపీ వాళ్లు కూడా అందరూ బాయిబాట పట్టారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలంటే ప్రశ్నించేందుకు, కార్మికుల బాధలు తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్తాయి కానీ పనిచేయాల్సిన వాళ్లు కూడా ఆందోళన చేయటమంటే కార్మికులను కన్‌ఫ్యూజ్ చేయటమేనని ఆమె సింగరేణికి ఎక్కువ బ్లాక్‌లు కేటాయించాలని, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆమె వెంట పలువురు జిల్లా టీఆర్‌ఎస్ నాయకులున్నారు.