ముంబై: భారత చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అగార్కర్‌ను తొలగించనున్నట్లు సాగుతున్న ప్రచారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అగార్కర్ స్థానంలో లక్ష్మణ్‌ను నియమించాలకుంటే, ఆయన ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో జహీర్ ఖాన్‌కు బాధ్యతలు కట్టబెట్టేందుకు బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బిసిసిఐ సభ్యులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ కాంట్రాక్ట్‌ను బిసిసిఐ పొడిగించకపోతే అతడి స్ధానాన్ని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భర్తీ చేయనుందని ఓ వార్తా సంస్థ పేర్కొంది. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. కానీ, బిసిసిఐ మరో మూడు నెలల పొడిగించింది. అంతేకాకుండా వన్డే వరల్డ్ కప్-2027 వరకు అతడినే కొనసాగించాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, టీమిండియా పేలవ ప్రదర్శనతో ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో ఓటమితో ఇటు అగార్కర్, అటు గౌతమ్ గంభీర్‌లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.