
జడ్చర్ల పట్టణంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడవేయడంతో ఆ శిశువు పాదాలను కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం హౌసింగ్‌బోర్డ్ కాలనీ గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడవేసి వెళ్లారు. దీంతో కాలనీవాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అప్పటికే మృతిచెందిన శిశువు రెండు కాళ్లు కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆడ శిశువు మృతదేహం అమానవీయ ఘటన ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశమైంది.














