బెంగళూరు: చిప్స్ ప్యాకెట్ లోని చిన్న బంతి బాలుడి ప్రాణం తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరీపుర గ్రామంలో సంతోష్, ఐశ్వర్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మయూర్(3) అనే బాలుడు ఉన్నాడు. ఇంటికొచ్చిన బంధువులలో ఒకరు మయూర్ కు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. చిప్స్ తింటుండగా ప్యాకెట్ లో ఉన్న బంతి నోట్లో పెట్టుకున్నాడు. బంతి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. చిప్స్ ప్యాకెట్ చిన్నారి ప్రాణం తీసిందని బంధువులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.