ప్రపంచంలో 400 కోట్ల జనాభా, ఆర్థిక వ్యవస్థలో 41 శాతం, వాణిజ్యంలో 26 శాతం వాటా కలిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కూడిన బ్రిక్స్ అగ్రనాయకులు సెప్టెంబర్ 12, 13 తేదీలలో భారత్ రాజధాని న్యూఢిల్లీలో సమావేశమై అనేక కీలక నిర్ణయాలకు నాంది పలుకనున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ధమాన దేశాల మీద ఎడాపెడా సుంకాలు పెంచుతూ వాటి ఆర్థిక, వాణిజ్యాలను దెబ్బ తీస్తున్న పూర్వరంగంలో జరుగుతున్న బిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా పార్లమెంటు, సుప్రీంకోర్టు అడ్డుకున్నా మరో సాకుతో సుంకాలు పెంచడం ట్రంప్ ఆపనందున డాలర్ పెత్తనాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ 5 పేరుతో బిక్స్ కరెన్సీని చెలామణిలోకి తేవాలని కూటమి సభ్య దేశాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ అగ్రనాయక సభలో మనకు నమ్మకమైన మిత్రుడుగా వున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తదితర సభ్యదేశాల అధినాయకులు తమ తమ భారీ ప్రతినిధి వర్గాలతో శిఖరాగ్ర సభకు రానున్నారు.

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐక్యరాజ్య సమితిలను నియంత్రణ చేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే యత్నాలు చేస్తూనే ఉన్నందున ఈ సంస్థలలో తేదలచిన సంస్కరణల గురించి అగ్రనాయకులు చర్చించనున్నారు. మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా, అంకుర సంస్థల ఏర్పాటు, కొత్త ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, పెంపు, సుస్థిర సరఫరా గొలుసుల ఏర్పాటు వంటి అనేక ప్రాముఖ్యం గల అంశాలపై అగ్ర నాయకులు తీసుకునే నిర్ణయాలు పేద దేశాలకు ఎంతో ఉపయోగకరం. ప్రపంచవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో ఎడతెగని సంఘర్షణలు, యుద్ధాల వల్ల సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు సతమతమవుతున్నారు. అందుకే సరకుల రవాణా గొలుసుల పటిష్టత ద్వారా నిరాటంకంగా సరఫరాలు పెరిగి, వాణిజ్య అభివృద్ధి జరగడం అన్ని దేశాలకు అవసరమే. సుస్థిర రీతిలో సరకుల రవాణా సహకారం పెంపొందించడం, స్వచ్ఛంద ఏకాభిప్రాయం గురించి, బిక్స్ బ్యాంక్ ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. సభ్యదేశాల మీద ఏకపక్షంగా విధించే ఆంక్షలను ఎదుర్కోవడంపై 11 సభ్య దేశాలు, మరో 10 భాగస్వామ్య దేశాల నేతలు చర్చిస్తారు.

ఆఫ్రికన్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఏషియన్ యూనియన్ నాయకులు, ఇరాన్, యుఎఇ, ఇండోనేషియా అధ్యక్షులు, అగ్ర నాయక సభలో పాల్గొంటున్నారు. ఈజిప్టు, సౌదీ అరేబియా, సభ్య దేశాలు గా, బెలారస్, బొలీవియా, క్యుబా, కజకిస్తాన్, మలేసియా, నై జీరియా, ఉగాండ, వియత్నాం, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్‌లు భాగ స్వామ్య దేశాలుగా పాల్గొనడం విశేషం. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న చైనా మధ్య ఈ సందర్భంగా జరిగే ఆర్థిక, వాణిజ్య చర్చలు ఉభయ తారకంగా ఉండగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేతృత్వంలో వచ్చే భారీ ప్రతినిధి వర్గం, మన ప్రధాని నేతృత్వంలో భారత ప్రతినిధి వర్గంతో జరిగే చర్చలు ద్వైపాక్షిక సంబంధాల ఇతోధిక వృద్ధి కి, ఆర్థిక, వాణిజ్యం విస్తరణకు తోడ్పడుతాయని రెండు దేశాలు ఆశాభావంతో వున్నాయి. అతి పెద్ద జనాభా, ఆర్థిక వ్యవస్థ, విస్తీర్ణం, ప్రాచీన నాగరికతలు గల భారత చైనాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటే అది ఉభయ దేశాల ప్రజలకు ఎంతో మేలు. కొనుగోలు శక్తి విషయంలో చైనా తొలి స్థానంలో, భారత్ 3వ స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచ జనాభాలో భారత, చైనాలు 35 శాతం కలిగి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల భారత, చైనాలలో పెక్కు నగరాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమై ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. నగరాలు, యూని వర్శిటీలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల మధ్య సహకారం విస్తరి స్తున్నది. ఇది రెండు దేశాలకే గాక ఆసియాకు, మొత్తం ప్రపంచానికి లాభిస్తుంది. భారత, చైనాలు సమీప భవిష్యత్తులో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా నిలువనున్నాయి. రెండు దేశాల ఉమ్మడి జిడిపి ప్రస్తుతం 28.4 శాతం. రెండు దేశాల పంచశీల సిద్ధాంతం అంతర్జాతీయ సంబంధాలకు ప్రాతిపదికగా ఉన్నాయి. కలసి సాగితే, పరస్పర సహకారం పెంపొందించు కుంటే అది రెండు దేశాల ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరం. సాంకేతిక పరిజ్ఞానంతో యువత రానున్న కాలంలో రెండు దేశాలకు వారధులుగా నిలవనున్నారు. బిక్స్, అనుబంధ దేశాలు ప్రపంచ జిడిపిలో 35 ట్రిలియన్‌లు దాటు తున్నందున ఈ దేశాల సమష్టి శక్తి, వచ్చే రెండేళ్లలో జి-7 దేశాల కంటే 3 రెట్లు ఎక్కువగా వృద్ధిచెందనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా. ప్రాచీన నాగరికత లకు నెలవులైన బిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు పెంపొందితే అది విశ్వశ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుంది.