
సినిమా కవిత్వాన్నీ, సంప్రదాయ కవిత్వాన్నీ తెలుగు సాహితీ మాగాణంలో జోడెడ్లుగా సమంగా కదం తొక్కించి సాహితీ సేద్యం చేసిన గొప్ప కలం కారుడు.. మహాకవి దాశరథి కృష్ణమాచార్య. సుమారు 80ఏళ్ళ నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. ‘నా తెలంగాణ కోటిరతణాల వీణ’ అని ఎలుగెత్తి అక్షర రణనినాదం చేసి వినువీధుల్లో తెలంగాణ సమర పతాకాన్ని పాతి.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిమంతుడై బాటలు వేశారు. ఇదే క్రమంలో తెలుగు భారతికి ముద్దుల పుత్రుడిగా... సకలాంధ్ర కవిగా, ప్రపంచాన ప్రథమ శ్రేణినలంకరించిన మహాకవిగా ప్రసిద్ధి కెక్కారు. 1925 జులై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా దాశరథీ కృష్ణమాచార్య జన్మించారు. తండ్రి వెంకటాచార్య గొప్ప కవి, పండితుడు. తల్లి వెంకటమ్మ గొప్ప హరికథ భాగవతారిని. దాశరథి ఉర్దూలో మెట్రిక్యులేషన్ (పదవ తరగతి), భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వద్యాలయంలో బిఎ (ఇంగ్లీషు) చదివాడు. తెలుగు, ఉర్దూల్లో మంచి పండితుడైనా సంస్కృతం, ఆంగ్లంలో కూడా మంచి పట్టును సాధించారు. తండ్రి స్ఫూర్తితో చిన్ననాటనే వ్యాకరణ సహిత చందోబద్ధ పద్యకవిత్వం రాశారు. ఆయన ఆధునిక భావాలు, ప్రజాపక్షం నిలిచి అక్షర గర్జన చేసే నిర్భయ, నిర్మొహమాట, గంభీర మూర్తిమంతుడు కావడం చేత నిజాం నవాబు అరాచక, అవినీతి, అక్రమ పాలనను సహించలేకపోయారు. ఈ నేపథ్యంలో నిజాం నిరంకుశ విధానాలను ప్రతిఘటించడానికి గార్లలో గొప్ప ప్రజాఉద్యమాన్ని ప్రభంజనంగా నడిపారు.
1947లో హైదరాబాద్‌లో నిజాం వ్యతిరేక ప్రజాస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని నిజాంకు సింహ స్వప్నమైనందున దాశరథిని వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ చంచల్‌గూడ జైళ్ళలో నిర్బంధించారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జైలులో ఉండగా... పళ్ళు తోముకోడానికి ఇచ్చిన బొగ్గును కలంగా చేసుకొని ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని!’, ‘మా నిజాం రాజు తరతరాల బూజు.. ముసలి నక్కకు రాచరికమా?’ అంటూ ఎద్దేవా చేస్తూ జైలు గోడలపై అక్షర పిడుగులు రాలుస్తూ, రణ నినాదాలు చేస్తూ ‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అంటూ ఎలుగెత్తి చాటుతూ రాశారు. ఇందుకు ఆయన ఘోరంగా దెబ్బలు తిన్నాడు. ఈ క్రమంలో నిజాం పోలీసులకు పట్టుబడకుండా చాలాకాలం అజ్ఞాత జీవితాన్ని గడిపారు. హైదరాబాద్ సంస్థానంకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చాక. జైలు నుంచి విడుదలైన తర్వాత దాశరథి తొలుత ఉపాధ్యాయుడు. అనంతరం పంచాయతీ ఇన్స్‌పెక్టర్, ఆకాశవాణి ప్రయోక్త ఉద్యోగాలు చేశారు. కాగా నిజాం వ్యతిరేక ఉద్యమం నడిపి జైలుపాలయినా, వివిధ ఉద్యోగాలు చేసినా ఆయన కవితా ప్రవృత్తిని మాత్రం మరువలేదు. పైగా కవిగా లబ్దప్రతిష్ఠులుగా పేరు గాంచారు. కథలూ, నవలలూ, నాటికలూ, పద్యకావ్యాలూ, గేయాలూ, కవితలూ, గజల్స్ ఇలా సాహిత్యం లోని అన్ని ప్రక్రియల్లో గొప్ప రచనలు చేశాడు. ఈ క్రమంలో దాశరథికి సినిమా పాటల రచనపై మక్కువ కలిగింది. దీంతో అగ్ర హీరో ఎఎన్‌ఆర్ దృష్టిలో పడ్డారు.
తెలంగాణలో మరో మహాకవి సి. నారాయణరెడ్డి అగ్రహీరో ఎన్‌టిఆర్ దృష్టిలోపడి ‘గులేబకావళి’ చిత్రంలో పూర్తి పాటలు రాసి ప్రసిద్ధుడైతే, ఎఎన్‌ఆర్ సిఫార్సుతో ఆత్రేయ వాగ్దానం చిత్రంలో అవకాశమిస్తే.. ‘నాకంటి పాపలో నిలిచిపోరా!’ గీతాన్ని రాసి సినీ వినీలాకాశంలో తన జెండా పాతారు. అనంతరం అక్కినేని తన సొంత చిత్రం ‘ఇద్దరు మిత్రులులో అవకాశం ఇవ్వగా ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ పాట రాసి హిట్ కొట్టి శిఖరాగ్రానికి చేరుకున్నారు.. అప్పటివరకు తెలుగు సినిమా పాటల రచనల్లో ఆంధ్ర రచయితల ఆధిపత్యం ఉండేది. తెలంగాణ నుంచి దాశరథి, సినారె ప్రవేశంతో అదిపోయింది. సినీ గీతాల రారాజులుగా వారిరువురు వెలిగారు. ఇలా ఉండగా అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, నాగార్జున చరిత్ర, పునర్నవం, మహేంద్రోదయం, మహాశిల్పి జక్కన్న (నవల), కవితా పుష్పకం, దాశరథీ శతకం, అమృతాభిషేకం, నవమంజరి, బలిగేయాలు, గాలిబ్ గీతాలు, ఏకశిల, ఇంకా పలు కవితా సంపుటాలను వెలువరించారు.
‘కవితా పుష్పకం’ కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. నిజాం వ్యతిరేక ప్రజా స్వాతంత్య్రోద్యమం నడిపినందుకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1972లో తామ్రపత్రం ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు. 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఇంకా రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల బహుమతులు అందుకున్నారు. 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా గొప్ప గౌరవాన్ని పొందారు. ఈయన అనంతరం మరొకరు ఆస్థాన కవిగా నియమింపబడలేదు. మడమ తిప్పని, రాజీపడని స్వాతంత్య్రోద్యమ పోరాట పటిమ, అకుంఠిత దేశభక్తి జీవితం, మహెూన్నత మహా కవి జీవితాలతో.. శిఖరాగ్రానికి ఎదిగిన దాశరథి.. తన జీవిత మహా ప్రస్థానాన్ని దిగ్విజయంగా ముగించుకొని 1987 నవంబర్ 5న తన 62 ఏళ్ళ వయసులో మహాభినిష్క్రమణ చెందారు. తెలుగు సరస్వతీ తల్లి మెడలో.. నిత్యనూతన, వికసిత, శాశ్వత, పరిమళభరిత, దైవ పుష్పపారిజాత మాలాం కృతుడై, మహెూజ్వల ప్రకాశిత సాహిత్య రత్నకచిత హార అలంకృతుడై చిరంజీవిగా భాసిస్తూనే ఉన్నారు.. జోహార్! దాశరథీ కృష్ణమాచార్యా..!
తాళ్ళపల్లి యాదగిరిగౌడ్
99497 89939











