
దేశ రాజధానిలో నిరసన చేపట్టిన విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దేశ చరిత్రలోనే మోదీ అంతటి విద్యార్థి వ్యతిరేక ప్రధానమంత్రి లేరని ఆరోపించారు. యువత సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా అవకతవకలను ఎత్తిచూపించిన వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకువెళ్లడం, బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు.
దీనిపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ యువతకు వ్యతిరేకి అని, బాధ్యతల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు. 152 పేపర్ లీక్‌లు జరిగి 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులుగా మారారు. ఇందుకు బాధ్యులైన ఒక్కరిని కూడా శిక్షించలేదు. అహరహం శ్రమంచి చదువుకున్న విద్యార్థులనే శిక్షిస్తున్నారు అని అన్నారు. విద్యకు సంబంధించిన న్యాయబద్ధమైన ప్రశ్నలు అడిగినందుకు వారికి లాఠీచార్జీలు, నిర్బంధాలు చవిచూపిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్‌లు చేసిన నేరస్థులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతుంటే ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థులను మాత్రం రోడ్లపై ఈడ్చుకువెళ్తూ, లాఠీలతో చితకబాదుతున్నారని అన్నారు.











