
భారత దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుంటే దేశంలో ఎక్కడైనా వైద్యం చేయవచ్చు. దేశంలో వైద్యుల రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ విధానంలో ఒక కీలక మార్పుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి) శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల వారీగా వేర్వేరు రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు తీసుకోవాల్సిన పరిస్థితికి బదులుగా, దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు సంఖ్యతో వైద్యులు ఎక్కడైనా వైద్యం చేసే విధానాన్ని ప్రతిపాదించింది. 2026లో ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, ఒక రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదు పొంది యూనిక్యూ ఐడెంటిఫికేషన్ ( యుఐడి) పొందిన వైద్యుడు, మరో రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ లేదా ప్రత్యేక లైసెన్స్ తీసుకోకుండానే ప్రాక్టీస్ చేయగలడు. ఇది కేవలం వైద్యుల సౌలభ్యానికి సంబంధించిన మార్పు కాదు. దేశంలోని వైద్య వ్యవస్థను మరింత ఏకీకృతం చేయడానికి, రిజిస్ట్రేషన్ వివరాలను ఒకే డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని చూడాలి.
ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏమిటి?
ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వైద్యుడు మరో రాష్ట్రంలో ప్రాక్టీస్ చేయాలంటే అక్కడి నిబంధనలకు అనుగుణంగా అదనపు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ వైద్యులు, సూపర్ స్పెషలిస్టులు, కన్సల్టెంట్లు, అకాడమిక్ ఫ్యాకల్టీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇది కొంత ఇబ్బందికరంగా మారుతోంది. దేశంలో వైద్యుల వలసలు పెరుగుతున్న సమయంలో ఒక రాష్ట్రంలో ఉద్యోగం, మరో రాష్ట్రంలో కన్సల్టేషన్, ఇంకొక రాష్ట్రంలో శిక్షణ లేదా వైద్య సేవలు, ప్రతి చోటా వేర్వేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం ఉండటం అనవసరమైన పరిపాలనా భారంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో “ఒక వైద్యుడు–ఒక దేశం–ఒక యుఐడి” అనే ఆలోచనకు ప్రాధాన్యత ఏర్పడింది.
యుఐడితో ఏం మారుతుంది?
ప్రతిపాదన ప్రకారం... రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైద్యుడి రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేస్తుంది. ఆ తర్వాత ఎన్ఎంసికి సంబంధించిన ఎథిక్స్, మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు అనేది వైద్యుడికి యూనిక్యూ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తుంది. ఈ యుఐడితో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కోడ్‌తో పాటు వైద్యుడి రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అనుసంధానమై ఉంటుంది. అంటే ఒక వైద్యుడి ప్రొఫెషనల్ గుర్తింపు దేశవ్యాప్తంగా ఒకే డిజిటల్ రికార్డులో కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వైద్యులకే కాదు, రోగులకు కూడా ఉపయోగకరమైన పరిణామం కావచ్చు. ఒక వైద్యుడి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు, లైసెన్స్ స్థితి, అవసరమైనప్పుడు క్రమశిక్షణా చర్యల వివరాలు వంటి సమాచారం మరింత పారదర్శకంగా అందుబాటులోకి రావచ్చు.
రాష్ట్ర వైద్య మండళ్ల పాత్ర పూర్తిగా పోతుందా?
ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్ల పాత్రను పూర్తిగా తొలగించడం లేదు. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను పరిశీలించడం, రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం వంటి బాధ్యతలు రాష్ట్ర స్థాయిలోనే కొనసాగుతాయి. అయితే ఆ రిజిస్ట్రేషన్ వివరాలు జాతీయ మెడికల్ రిజిస్టర్లో కూడా ప్రతిబింబిస్తాయి. జాతీయ, రాష్ట్ర రిజిస్టర్ల మధ్య ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ సమన్వయం ఉండేలా ప్రతిపాదించారు. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఒక రాష్ట్రంలో జరిగిన మార్పు మరో రిజిస్టర్లో కూడా ప్రతిబింబిస్తే, ఒకే వైద్యుడికి రెండు రకాల సమాచారం ఉండే అవకాశాలు తగ్గుతాయి.
క్రమశిక్షణ విషయంలో పారదర్శకత అవసరం
వైద్య వృత్తిలో లైసెన్స్ అనేది కేవలం ఒక సంఖ్య కాదు. అది రోగుల ప్రాణాలతో ముడిపడిన బాధ్యత. అందువల్ల ఒక వైద్యుడిపై క్రమశిక్షణా చర్య తీసుకున్నప్పుడు, ఆ సమాచారం దేశవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సక్రమంగా నమోదు కావడం చాలా అవసరం. ప్రతిపాదిత వ్యవస్థలో నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనేది ఒక కేంద్ర సమాచార భాండాగారంలా పనిచేయనుంది. లైసెన్స్ యాక్టివ్‌గా ఉందా, ఇన్‌యాక్టివ్‌గా ఉందా, సస్పెన్షన్, రిజిస్ట్రేషన్ తొలగింపు లేదా పునరుద్ధరణ వంటి వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణా చర్యలపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికార పరిధిని ప్రధానంగా కొనసాగిస్తున్నట్లు ప్రతిపాదన చెబుతోంది. ఏ ప్రాంతంలో వృత్తిపరమైన తప్పిదం జరిగిందో, ఆ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర మండలి పాత్ర కీలకంగానే ఉంటుంది.
ఈ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
మొదటిది వైద్యుల చలనశీలత పెరుగుతుంది. దేశంలో ఎక్కడైనా సేవలు అందించడానికి అదనపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేకపోవడం వల్ల వైద్యులకు సౌలభ్యం కలుగుతుంది. రెండవది డిజిటల్ పారదర్శకత పెరుగుతుంది. జాతీయ, రాష్ట్ర రిజిస్టర్లు అనుసంధానమైతే వైద్యుల ప్రొఫెషనల్ రికార్డు మరింత స్పష్టంగా ఉంటుంది. మూడవది నకిలీ వైద్యుల నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఒకే యుఐడి ద్వారా వైద్యుడి గుర్తింపును ధృవీకరించడం సులభమవుతుంది. నాలుగవది వైద్య నిపుణుల కొరత ఉన్న ప్రాంతాలకు ప్రయోజనం కలగవచ్చు. అవసరమైన ప్రాంతాల్లో సూపర్ స్పెషలిస్టులు, కన్సల్టెంట్లు సేవలు అందించేందుకు పరిపాలనా అడ్డంకులు తగ్గవచ్చు. అయితే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థ మంచిదే అయినప్పటికీ, దాని అమలు అత్యంత జాగ్రత్తగా జరగాలి.
ప్రతి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ, స్థానిక చట్టాలు, ఆసుపత్రుల విధానాలు, వైద్య సేవల అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒకే లైసెన్స్ అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన నియంత్రణ అని అర్థం కాకూడదు. అలాగే ఒక రాష్ట్రంలో జరిగిన తీవ్రమైన క్రమశిక్షణా చర్య మరో రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుడికి వెంటనే వర్తించేలా డేటా సమన్వయం ఉండాలి. డిజిటల్ వ్యవస్థలో తప్పు సమాచారం నమోదు అయితే దాన్ని సరిదిద్దే స్పష్టమైన విధానం కూడా ఉండాలి. వైద్యుడి ప్రతిష్ఠ, వృత్తి భవిష్యత్తు ఈ రికార్డులతో ముడిపడి ఉంటుంది కాబట్టి డేటా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమైనది.
ఇది వైద్యులకు మాత్రమే కాదు, రోగులకు కూడా సంబంధించిన సంస్కరణ
సాధారణంగా ఇటువంటి మార్పులను వైద్యుల సౌలభ్యంగా మాత్రమే చూస్తాం. కానీ అసలు ప్రయోజనం రోగులకు కలగాలి. ఒక వైద్యుడు నిజంగా నమోదైనవారా? ఆయన లైసెన్స్ చెల్లుబాటులో ఉందా? ఆయనపై ఏదైనా తీవ్రమైన క్రమశిక్షణా చర్య ఉందా? వంటి ప్రాథమిక విషయాలను విశ్వసనీయమైన జాతీయ వ్యవస్థ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటే, రోగుల విశ్వాసం పెరుగుతుంది. అందుకే సింగిల్ లైసెన్స్ కంటే సింగిల్ ట్రాన్స్పరెంట్ రికార్డ్ మరింత ముఖ్యమైనది.
ఐదేళ్ల లైసెన్స్ చెల్లుబాటు
ప్రతిపాదనలో ప్రస్తుత విధానంలోని ఐదేళ్ల లైసెన్స్ చెల్లుబాటును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే సింగిల్ యుఐడి వచ్చినంత మాత్రాన లైసెన్స్ జీవితకాలం చెల్లుబాటు అవుతుందని భావించకూడదు. లైసెన్స్ పునరుద్ధరణ, నిరంతర వైద్య విద్య, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలు వంటి అంశాలు భవిష్యత్తులో కూడా కీలకంగానే ఉంటాయి.
ముందున్న దారి
ఎన్ఎంసి ఈ ముసాయిదాపై ప్రజలు, వైద్యులు, వైద్య సంఘాలు, రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్ల నుంచి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే దేశవ్యాప్తంగా పనిచేసే వైద్య వ్యవస్థను రూపొందించేటప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించే వైద్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా ఒకే యుఐడి, ఒకే డిజిటల్ రికార్డు, సులభమైన రిజిస్ట్రేషన్ ఇవన్నీ కాలానుగుణమైన సంస్కరణలే. కానీ అదే సమయంలో రాష్ట్రాల నియంత్రణాధికారాలు, వైద్యుల న్యాయపరమైన హక్కులు, క్రమశిక్షణా విధానం, డేటా భద్రత, రోగుల ప్రయోజనాలు సమతుల్యంగా ఉండాలి. చివరికి ఇది కేవలం “వైద్యులకు ఒకే లైసెన్స్” అనే సంస్కరణగా కాకుండా, “దేశానికి ఒక సమగ్ర, పారదర్శక, బాధ్యతాయుతమైన వైద్య రిజిస్ట్రేషన్ వ్యవస్థ”గా మారితేనే దీని అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది.
వైద్యుడికి స్వేచ్ఛ ఉండాలి…
రోగికి భద్రత ఉండాలి…
వ్యవస్థకు పారదర్శకత ఉండాలి.
ఈ మూడు సమతుల్యంగా సాధించగలిగితేనే సింగిల్ మెడికల్ లైసెన్స్ భారత వైద్యరంగంలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలుస్తుంది.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు








